ఐటీ అధికార్ల రెయిడ్ ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో కలకలం పుట్టిస్తోంది. ప్రముఖ తమిళ సినీ నిర్మాత, ఫిల్మ్ ఫైనాన్షియర్ జీఎన్ అన్బు చెజియన్ పై ఐటీ అధికారులు రెయిడ్ చేస్తున్నారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై, మధురైలలో ఆయనకు చెందిన 40 ప్రాంతాల్లో ఏకకాలలో సోదాలు జరుగుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే రెయిడింగ్స్ జరుగుతున్నాయి. అన్చు చెజియన్ నివాసం, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. మధురైలోనే దాదాపు 30 చోట్ల సోదాలు జరుగుతుండగా... చెన్నై, ఇతర ప్రాంతాల్లో 10 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.
అన్బు చెజియన్ పై ఐటీ దాడులు కొనసాగుతుండటంతో తమిళ సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది. అన్బుపై ఐటీ దాడులు జరగడం ఇది మూడోసారి. మరోవైపు కోలీవుడ్ కు చెందిన మరి కొందరు ప్రముఖులు కూడా ఐటీ స్కానర్ లో ఉన్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో, పలువురు సినీ పెద్దలు కలవరానికి గురవుతున్నారు. చివరిసారి 2020 ఫిబ్రవరిలో ఐటీ రెయిడ్స్ జరిగాయి. విజయ్ నటించిన 'బిగిల్' సినిమా విడుదలైన తర్వాత ఆయన నివాసం, కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఆ సమయంలో విజయ్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.