కోవిడ్ ప్రభావం...ప్రస్తుతం రష్యా..ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దం వెరసీ ప్రపంచవ్యాప్తంగా నేడు ద్రవ్యోల్బణం సమస్య దాదాపు అన్ని దేశాలను వెంటాడుతోంది. ధరల మంట (ద్రవ్యోల్బణం)కు మన దేశంలో సామాన్యులే కాకుండా, మధ్యతరగతి ప్రజలు సైతం లబోదిబోమనే పరిస్థితి నెలకొంది. ఇదంతా కరెన్సీ విలువ తగ్గడం వల్ల వచ్చిన చిక్కే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి, పంపిణీ సమస్యలు కూడా దీనికి తోడయ్యాయి. కానీ, కొన్ని దేశాల్లో ఈ ధరల మంట మామూలుగా లేదు. కరోనా విపత్తు నుంచి ప్రపంచం తెరిపిన పడుతూ బలంతో లేచే ప్రయత్నం చేస్తున్న తరుణంలో.. ఉక్రెయిన్ పై రష్యా మొదలు పెట్టిన యుద్ధం ప్రపంచ పరిస్థితులను కుడితిలో పడిన ఎలుకలా మార్చేసింది.
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా వరుసగా నాలుగో నెలలో వడ్డీ రేట్లను పెంచింది. దశాబ్దాల గరిష్ఠ స్థాయికి చేరిన ద్రవ్యోల్బణం తిరిగి శాంతించడానికి రెండు నుంచి మూడేళ్లు పడుతుందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఆస్ట్రేలియా గవర్నర్ ఫిలిప్ లోవే స్వయంగా పేర్కొన్నారు. దక్షిణ కొరియాలో వినియోగదారుల ద్రవ్యోల్బణం 24 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. జపాన్ లోనూ 18 నెలల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం ఎగసింది. దీంతో కనీస వేతనాన్ని అక్కడ పెంచనున్నారు.
ఇక ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉన్న దేశాలను గమనిస్తే.. వెనెజులాలో 1198 శాతం, సూడాన్ లో 340 శాతం, లెబనాన్ లో 201 శాతం, సిరియాలో 139 శాతం, సురినేమ్ లో 63 శాతం, జింబాబ్వేలో 60 శాతం, అర్జెంటీనాలో 51 శాతం, టర్కీలో 36 శాతం, ఇరాన్ లో 35 శాతం, ఇథియోపియాలో 33 శాతంగా ఉంది. ఫలితంగా అగ్ర రాజ్యాల నుంచి పేద దేశాల వరకు అన్నింటా వడ్డీ రేట్ల పెంపు కొనసాగుతోంది. మన దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతం స్థాయిలో ఉంది. తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి.