నేషనల్ హెరాల్డ్ కేసు పేరిట ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కాంగ్రెస్ అగ్ర నాయకత్వంపై కొనసాగిస్తున్న విచారణ పర్వాన్ని నిరసిస్తూ శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. పార్టీకి చెందిన నేతలంతా నిరసనకారులుగా నలుపు రంగు దుస్తులేసుకుని మరీ రోడ్లపైకి వచ్చారు. ఈ క్రమంలో ఎక్కడికక్కడ పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ ఆందోళనల్లో భాగంగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. కాంగ్రెస్ నిరసనల్లో భాగంగా పార్టీకి చెందిన అందరు నేతల మాదిరే నలుపు రంగు దుస్తులేసుకుని రోడ్డు మీదకు వచ్చిన పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా పార్టీ శ్రేణులను ముందుండి నడిపించారు. ఈ సందర్భంగా వారిని అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్ లను ఏర్పాటు చేశారు. అడుగు ముందుకేయడానికి వీలు లేకుండా ఏర్పాటు చేసిన బారికేడ్‌ను సైతం లెక్కచేయని ప్రియాంక... అవలీలగా బారికేడ్‌ను ఎక్కి దానిపై నుంచి దూకారు. కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.