ప్రధాని అభ్యర్థి ఎంపికపై సాగుతున్న పోలింగ్ తో బ్రిటన్ లో రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ తప్పుకోవడంతో కొత్త ప్రధాని ఎవరన్న దానిపై కసరత్తు జరుగుతోంది. ప్రధాని రేసులో భారత సంతతి నేత రిషి సునాక్ మొదట్లో జోరు కనబర్చినా, ఆ తర్వాత లిజ్ ట్రస్ ధాటికి వెనుకబడ్డారు. అయితే, ఓ టీవీ చర్చ కార్యక్రమంలో లిజ్ ట్రస్ పై సునాక్ ఆశ్చర్యకర విజయం సాధించారు.
స్కై న్యూస్ చానల్ నిర్వహించిన డిబేట్లో ఆడియన్స్ లో అత్యధికులు కన్జర్వేటివ్ పార్టీ నేత రిషి సునాక్ నాయకత్వాన్ని బలపరిచారు. ఆ చానల్ డిబేట్లో ఉపయోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ పాడైపోవడంతో, వారంతా చేతులు పైకెత్తి సునాక్ కు మద్దతు పలికారు. ఒపీనియన్ పోల్స్ లో చాలావరకు లిజ్ ట్రస్ వైపు మొగ్గుచూపుతుండగా, చానల్ స్టూడియోలో ప్రేక్షకులు రిషి సునాక్ కు ఓటేయడం బ్రిటన్ రాజకీయ వర్గాలను కూడా విస్మయానికి గురిచేసింది.
గత కొన్నిరోజులుగా ట్రస్ ప్రచారబృందం కొన్ని విధానాలపై చేసిన ప్రకటనలు బెడిసికొడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. లండన్ వెలుపల నివసించే ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇవ్వడం ద్వారా 10.75 బిలియన్ డాలర్ల మేర ప్రభుత్వానికి ఆదా అవుతుందని ట్రస్ టీమ్ పేర్కొంది. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నట్టు గమనించిన ట్రస్ వెంటనే యూటర్న్ తీసుకున్నారు. దీనిపై స్కై న్యూస్ చానల్ యాకంర్ బర్లీ... లిజ్ ట్రస్ ను ప్రశ్నించారు. ఆ ప్రతిపాదనను తన టీమ్ సభ్యులు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ, ఆ విధంగానే ప్రజలకు వివరించారని లిజ్ ట్రస్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమం ఆసాంతం బర్లీ అడిగిన ప్రశ్నలతో లిజ్ ట్రస్ ఇబ్బందిపడ్డారు.