శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు జరుగుతున్న నేరాల అదుపునకై విచిత్ర నిబంధన పెట్టారు. ఆ నిబంధనపై ప్రజలు భగ్గుమన్నడంతో పోలీసు యంత్రాంగం కాస్త వెనక్కి తగ్గింది. మంగళూరు పోలీసులు విధించిన ఆంక్షలపై ప్రజల నుంచి విమర్శలు రావడంతో వెనక్కితగ్గారు. మంగళూరు కమిషనరేట్ పరిధిలో బైక్ వెనుక సీట్పై పురుషులు ప్రయాణించడంపై నిషేధం విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆంక్షలు విధించిన గంటలోనే ఉత్తర్వులను వెనక్కు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ శశికుమార్ ప్రకటించారు. పది రోజుల వ్యవధిలో వరుస మూడు హత్యలు దక్షిణ కన్నడ జిల్లాలో మతపరమైన ఉద్రిక్తతలకు కారణమైన నేపథ్యంలో మంగళూరు పోలీసులు తీసుకున్న నిర్ణయం చర్చకు దారితీసింది.
తమ కమిషనరేట్ పరిధిలో ద్విచక్రవాహనం వెనుక పురుషులు ప్రయాణించడంపై నిషేధం విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు బైక్లపై పురుషులెవరూ వెనుక సీట్పై ప్రయాణించరాదని పేర్కొన్నారు. కానీ, 18 ఏళ్లలోపు వారికి, వృద్ధులకు దీనిని నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఈ ఆంక్షలు ఆగస్టు 8 వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
144 సెక్షన్ అమలుచేసిన పోలీసులు.. బహిరంగ ప్రదేశాల్లో నినాదాలు, ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం, ఆందోళనలకు దిగడం, ఫొటోలు/ పోస్టర్లు ప్రదర్శించడం.. ఆయుధాలతో తిరగడం, టపాసులు పేల్చడం, దిష్టిబొమ్మలు దగ్దం కూడా నిషేధం విధించారు. అంతేకాదు, ఆగస్టు 8 వరకు ప్రైవేటు ఫంక్షన్లు, వేడుకలు, ర్యాలీలు నిర్వహించవద్దని ఆదేశించారు. పోలీసుల విచిత్ర ఆంక్షలపై విస్మయం వ్యక్తం చేసిన ప్రజలు.. తీవ్రంగా వ్యతిరేకించడంతో యూటర్న్ తీసుకున్నారు.
మంగళూరు జిల్లాలో పది రోజుల వ్యవధిలో జరిగిన మూడు వరుస హత్యలతో ఉద్రిక్తతలు నెలకున్నాయి. ముఖ్యంగా బీజేపీ యువనేత ప్రవీణ్ నెట్టారును కొందరు కిరాతకంగా హత్య చేయడం తీవ్ర దుమారం రేగింది. ప్రవీణ్ హత్యకు నిరసనగా హిందూ సంఘాల భారీ ర్యాలీలు, ఆందోళనలు చేపట్టాయి. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడుతూ.. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మంగళూరు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి ఆంక్షలు విధించారు. ప్రజా ప్రయోజనాల కోసం ఇటువంటి ఆంక్షలు విధించినట్టు మంగళూరు సీపీ శశి కుమార్ ప్రకటించినా.. చివరకు విమర్శలతో వెనక్కి తగ్గారు.
నగర వ్యాప్తంగా 19 చెక్ పోస్టులను ఏర్పాటుచేసిన పోలీసులు.. రాత్రిపూట అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న 200కిపైగా వాహనాలను సీజ్ చేశారు. జులై 19న కేరళ యువకుడు మసూద్ (18)పై బళ్లారి సమీపంలో పలువురి దాడికి పాల్పడటంతో తీవ్రంగా గాయపడిన అతడు రెండు రోజుల తర్వాత మృతిచెందాడు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత సూరత్కల్‌లో మహ్మద్ ఫాజిల్ (23) అనే యువకుడ్ని దుండుగులు హత్య చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa