తరచూగా అదృశ్యమయ్యే శ్రీలంక ఆటగాళ్లు తాజాగా బ్రిటన్‌లోని బర్మింగ్హమ్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీలంకకు చెందిన 10 మంది ఆటగాళ్లు అనుమానాస్పదరీతిలో అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. తమ దేవంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం కొనసాగుతుండటం వల్ల బహుశా ఉపాధి కోసం వారు యూకేలోనే ఉండిపోవాలనే ఆలోచనతో ఇలా వ్యవహరించి ఉండొచ్చని శ్రీలంక అధికారులు అనుమానిస్తున్నారు. తమ తమ ఈవెంట్లు పూర్తికాగానే తొమ్మిది మంది అథ్లెట్లు, ఒక మేనేజర్ అదృశ్యమైనట్లు శ్రీలంకకు చెందిన ఓ అధికారి ఆదివారం వెల్లడించారు. వారిలో ముగ్గురు గత వారమే అదృశ్యమయ్యారని, దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
ఆ తర్వాత నుంచి మరో ఏడుగురు ఆచూకీ లేకుండా పోయారని తెలిపారు. కామన్వెల్త్ క్రీడలకు మొత్తం 160 మంది సభ్యులతో కూడిన శ్రీలంక బృందం బ్రిటన్‌కు వెళ్లింది. మొదటి అదృశ్యమైన ముగ్గురిని బ్రిటన్ పోలీసులు గుర్తించారు. వీళ్లు స్థానిక చట్టాలను ఉల్లంఘించలేదని, ఆరు నెలలపాటు చెల్లుబాటయ్యే వీసాలు కలిగి ఉండటంతో ఎటువంటి చర్యలు తీసుకోలేదని శ్రీలంక అధికారి తెలిపారు. కానీ, వారి ఆచూకీ మాత్రం ఆయన వెల్లడించలేదన్నారు.
శ్రీలంక క్రీడాకారుల మిస్సింగ్ గురించి వెస్ట్ మిండ్‌లాండ్స్ పోలీస్ ఫోర్స్ మాట్లాడుతూ.. కామన్వెల్త్ క్రీడలకు వచ్చిన ఆరుగురు శ్రీలంక ఆటగాళ్లు మిస్సైనట్టు నివేదిక వచ్చిందని, వారి ఆచూకీ గురించి ఆరా తీస్తున్నామన్నారు. అయితే, వారు క్షేమంగానే ఉంటారని భావిస్తున్నామని చెప్పారు. అయితే, పూర్తి వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు.
గతంలోనూ పలు అంతర్జాతీయ క్రీడాపోటీలకు వెళ్లినప్పుడు శ్రీలంక ఆటగాళ్లు అదృశ్యమైన ఘటనలు ఉన్నాయి. గతేడాది అక్టోబరులో నార్వే రాజధాని ఓస్లో వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ సందర్భంగా శ్రీలంక రెజ్లింగ్ మేనేజర్ తన జట్టును వదిలిపెట్టి అదృశ్యమయ్యారు. 2014లో దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా క్రీడల్లోనూ ఇద్దరు శ్రీలంక అథ్లెట్లు కనిపించకుండా పోయారు. ఇదిలా ఉండగా, దాదాపు ఆరు నెలల నుంచి శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న విషయం తెలిసిందే.