ప్రధానిగా ఉన్న వ్యక్తి ఓ సాధారణ వ్యక్తిలా జీవించడం అంటే అతిశయోక్తే. కానీ ప్రధాని అయినా సామాన్యుడిలా జీవించవచ్చు అని ఆచరణలో చూపించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇదిలావుంటే ప్రధాని నరేంద్ర మోదీ రూ.1.1 కోట్ల విలువ చేసే తన ప్లాట్‌ను విరాళంగా ఇచ్చేశారు. ఇప్పుడిక ఆయనకు స్థిరాస్తులేవీ లేవు. సొంత వాహనం కూడా లేదు. ఏటా ఆస్తులు, అప్పులు వివరాలను వెల్లడిస్తున్న ప్రధాని మోదీ (ఈ ఏడాది కూడా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. మంగళవారం పీఎంవో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 31 నాటికి ప్రధాని మోదీ ఆస్తుల విలువ రూ.2.23 కోట్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఆయన ఆస్తుల విలువ రూ.26 లక్షల మేర పెరిగాయి. ఈ ఆస్తులు అధికంగా బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో ఉన్న కొంత నివాస యోగ్యమైన భూమిలో తన వాటాను ప్రధాని మోదీ దానంగా ఇచ్చారని, ఆయనకు స్థిరాస్తులేవీ లేవని పీఎంవో పేర్కొంది. బాండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో మోదీకి పెట్టుబడులు లేవని, ఆయనకు సొంత వాహనం కూడా లేదని వెల్లడించింది.
ప్రధాని మోదీకి 4 బంగారు ఉంగరాలు ఉన్నాయి. వాటి విలువ రూ.1.73 లక్షలు ఉంటుందని ఆస్తుల వివరాల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి నరేంద్ర మోదీ మొత్తం ఆస్తుల విలువ రూ.2,23,82,504లుగా ఉన్నట్టు పీఎంవో తెలిపింది. ప్రస్తుతం మోదీ చేతిలో రూ.35,250 నగదు, పోస్ట్ ఆఫీస్‌లో రూ.9,05,105 విలువ చేసే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లతో పాటు రూ.1,89,305 విలువ చేసే జీవిత బీమా పాలసీ ఉన్నట్టు పీఎంవో వెల్లడించింది. 2002 అక్టోబర్‌లో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో మరో ముగ్గురు వాటాదార్లతో కలిసి నివాసయోగ్య భూమి (సర్వే నంబర్ 401/ఎ)ని కొనుగోలు చేశారు. ఇందులో ఒక్కొక్కరికీ 25 శాతం వాటా ఉండగా.. ఆ స్థలాన్నే ఇప్పుడు మోదీ విరాళంగా ఇచ్చినట్టు పీఎంవో తెలిపింది.