దేశంలో ద్రవ్యోల్భణం తగ్గిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా సమయంలో మందగించిన ఆర్థిక పరిస్థితి తాజాగా ఓ మోస్తరు మెరుగుదలను నమోదుచేసుకొంది. దేశంలో ఆందోళన రేకెత్తిస్తున్న ద్రవ్యోల్బణం తగ్గగా... అదే సమయంలో ఎదుగూ బొదుగూ లేకుండా సాగుతున్న పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈ మేరకు శుక్రవారం ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక దేశ ప్రజలకు ఊరటనిచ్చే వార్తను చెప్పింది.
జూన్ మాసంలో 7.01గా ఉన్న ద్రవ్యోల్బణం.. జులై మాసానికంతా 6.71కి దిగింది. ద్రవ్యోల్బణంలో తరుగుదల లేశమాత్రమే అయినప్పటికీ... ఈ మాత్రం మార్పు కేవలం నెల వ్యవధిలోనే కనిపించడం గమనార్హం. ఇక ఏప్రిల్- జూన్ మాసంలో దేశంలో పారిశ్రామికోత్పత్తిలో ఏకంగా 12.7 శాతం పెరుగుదల నమోదైంది. వెరసి ఇటు ద్రవ్యోల్బణం దిగివస్తుండగా... పారిశ్రామికోత్పత్తి పెరుగుదల ఆహ్వానించదగ్గ పరిణామమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.