కామెన్ వెల్త్ క్రీడాల్లో భారత్ కు పతకాలు తెచ్చిపెట్టిన మన దేశ క్రీడాకారులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మీయ ఆహ్వానం పలికారు. శనివారంనాడు తన అధికారిక నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. బర్మింగ్ హామ్ వేదికగా జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. ఇందులో భారత్ మొత్తం 61 పతకాలు కైవసం చేసుకుని పతకాల పట్టికలో ఆస్ట్రేలియా (178), ఇంగ్లండ్ (175), కెనడా (92) దేశాల తర్వాత నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ సాధించిన పతకాల్లో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా పతక విజేతలను ప్రధాని మోదీ ఢిల్లీలోని తన నివాసానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ క్రీడాకారులు చూపిన ప్రతిభ పట్ల దేశం గర్విస్తోందని పేర్కొన్నారు. పతకాల సాధన మాత్రమే కాకుండా, ఇతర దేశాల క్రీడాకారులకు మన దేశ క్రీడాకారులు ఇచ్చిన పోటీ గొప్పగా ఉందని ప్రశంసించారు. హాకీలో పురుషులు, మహిళల జట్లు ఉత్తమరీతిలో పోరాడాయని కితాబునిచ్చారు. పతకాల సాధనలో కోచ్ ల పాత్ర కీలకమైందని, ఖేలో ఇండియా ద్వారా యువతలో దాగున్న ప్రతిభను ప్రోత్సహిస్తున్నామని మోదీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, క్రీడల శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రమాణిక్ కూడా పాల్గొన్నారు.