ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసంపై జాతీయ పతాకం రెపరెపలాడుతూ కనిపించింది. దేశంలో 75 వసంతాల స్వాతంత్ర్యోద్యమ వేడుకలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన మేరకు నేతలు, ప్రజలు హర్ ఘర్ తిరంగా కార్యాచరణకు మద్దతునిస్తున్నారు. తమ నివాసాలపై జాతీయ జెండా ఎగురవేసి స్వతంత్ర స్ఫూర్తిని చాటుతున్నారు. ఏపీ సీఎం జగన్ కూడా తాడేపల్లిలోని తన నివాసంపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కాగా, హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కోటి జాతీయ పతాకాలను పంపిణీ చేసింది.
అటు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. 75 వసంతాల స్వాతంత్ర్య భారతంలో, దేశం నలుమూలలా రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం ప్రజలందరిలో భావోద్వేగాన్ని నింపుతుందని పేర్కొన్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మన తెలుగువాడు అయినందున ఈ కార్యక్రమం తెలుగు ప్రజలకు ఎంతో ప్రత్యేకమని అభివర్ణించారు.