శృంగవరపుకోట నియోజకవర్గం వ్యాప్తంగా నిషేధిత అక్రమ ఖైని, గుట్కాలను యువతకు ఎరగా వేసి, యదేచ్ఛగా సరఫరా చేస్తూ లక్షల్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు కొంతమంది అక్రమార్కులు. అక్రమ మార్గాల్లో కొత్త పుంతలు తొక్కుతూ రాష్ట్ర సరిహద్దులు దాటి నిషేధిత ఖైనీ, గుట్కాలను పల్లెటూర్ల నుండి పట్నం వరకు క్రయ, విక్రయాలు చేపడుతున్నారు అక్రమ వ్యాపారులు. నిషేధిత గుట్కాలపై ఉక్కుపాదం మోపి ఎప్పటికప్పుడు పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ వ్యాపారులు మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదనే చందంగా వ్యవహరిస్తుండడం ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తోందని స్థానికులు అంటున్నారు. అక్రమ మార్గాలలో నిషేధిత ఖైనీ, గుట్కా రవాణా చేస్తూ అక్రమార్కులు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా నిషేధిత గుట్కా ప్యాకెట్లు యధేచ్చగా లభించడం వెనుక ఆంతర్యమేమిటని స్థానిక ప్రజలు తమ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దాడులు చేసి అక్రమ గుట్కా వ్యాపారులుపై కేసులు నమోదు చేస్తున్నారు. అయినా కేసులకు భయపడి వ్యాపారం ఆపే ప్రసక్తే లేదనే విధంగా కొందరు వ్యాపారులు తీరు అందుకు నిదర్శనం. శృంగవరపుకోట మండలంలో శృంగవరపుకోట పట్టణ కేంద్రం నుండి సీతంపేట, సంతగౌరమ్మపేట, వినాయకపల్లి, తలారి, తిమిడి, వెంకటరమణపేట తదితర గ్రామాల్లో నిషేధిత ఖైనీ, గుట్కా అమ్మకాలను యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు వ్యాపారులు. ఆరోగ్యానికి హాని కలిగించే నిషేధిత ఖైనీ, గుట్కా అమ్మకాలపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపాలని స్థానికులు విన్నవించుకుంటున్నారు.