ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపునకు ఎంతో మంది స్పందించారు. మంకీ పాక్స్ కు ప్రత్యామ్నాయ పేరును సూచిస్తూ అనేక పేర్లను పంపించారు. ఇదిలావుంటే కరోనా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగకముందే మంకీ పాక్స్ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆఫ్రికాలో మొదలైన ఈ వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఇప్పటి వరకు 31 వేలకుపైగా మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. మొదట్లో కోతుల నుంచి మనుషులకు వ్యాపించడం వల్ల దీనికి మంకీ పాక్స్ అనే పేరు పెట్టారు. కానీ ఇప్పుడు ఈ వైరస్ వ్యాప్తికి, కోతులకు నేరుగా ఎటువంటి సంబంధం లేదు. అది మనుషుల నుంచి మనుషులకు సోకుతోంది. మంకీ పాక్స్ వైరస్ సోకుతుందేమోనన్న భయంతో పలు దేశాల్లో కోతులను కొట్టి చంపుతున్న నేపథ్యంలో ఈ వైరస్ ను మంకీ పాక్స్ పేరుతో పిలవడం సరికాదని నిపుణులు అభిప్రాయపడ్డారు.
దాంతో, మంకీ పాక్స్ వైరస్ కు మరో పేరు పెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్ణయించింది. సాధారణంగా వ్యాధులకు డబ్ల్యూహెచ్ ఓ టెక్నికల్ కమిటీనే పేరు నిర్ణయిస్తుంది. కానీ, మంకీపాక్స్ కు తగిన పేరు సూచించాలని ఈసారి ప్రజలు, నిపుణులను కోరింది. దీనికి వైద్య నిపుణులు, ప్రజల నుంచి స్పందన వస్తోంది.
‘పాక్సీ మెక్పాక్స్ పేస్’, ‘ఎంపాక్స్’, ‘ఒపోక్సిడ్-22’ అనే పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో ‘ఎంపాక్స్’ పేరును రెజో అనే పురుషుల ఆరోగ్య సంస్థ డైరెక్టర్ సామ్యూల్ మిరిల్లో సూచించారు. దీన్ని ఇప్పటికే కెనడాలో వివిధ ప్రచార కార్యక్రమాల్లో వాడుతున్నారు. ఈ వైరస్ పేరు చెప్పగానే కోతుల నుంచి వ్యాపిస్తుందన్న భావనను తొలగిస్తే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటారని మిరిల్లో అభిప్రాయపడ్డారు.
మరికొందరు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ప్రతిబింబించేలా ‘ట్రంప్-22’ అనే పేరు సూచించారు. ట్రంప్ గతంలో కరోనా వైరస్ ను ‘చైనీస్ వైరస్’ అని వ్యాఖ్యానించారు. ‘ట్రంప్-22’ ప్రతిపాదనపై డబ్ల్యూహెచ్ఓ స్పందించింది. తాము హాస్యాస్పదమైన పేరు పెట్టబోమని డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి ఫడెలా చైప్ చెప్పారు. తమకు వచ్చిన ప్రతిపాదనల్లో శాస్త్రీయ ప్రామాణికత, వాటి ఆమోదయోగ్యత, ఉచ్చారణ, వివిధ భాషల్లో ఉపయోగించవచ్చా అనే విషయాలు పరిశీలించి కొత్త పేరును ఖరారు చేస్తామని స్పష్టం చేశారు.