తమిళనాడులో రాజకీయాలలోకి సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున్న వలసలు సాగుతుంటాయి. ఇదే క్రమంలో తాజాగా ఓ వార్త ఆ రాష్ట్రంలో జోరుగా ప్రచారం సాగుతోంది. దక్షిణాది భాషా చిత్రాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి త్రిష... తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారన్న వార్తలు తమిళనాడులో చక్కర్లు కొడుతున్నాయి. సహ నటుడు విజయ్ సేతుపతి సలహా మేరకు రాజకీయాల్లోకి ప్రవేశించాలని త్రిష దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా ఆ వార్తలు చెబుతున్నాయి. ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం పొన్నియన్ సెల్వన్ లో నటిస్తున్న త్రిష పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు.
ఈ క్రమంలోనే సినీ రంగంలో మంచి గుర్తింపు సంపాదించుకుని ఆ తర్వాత రాజకీయాల్లో సత్తా చాటిన మాజీ సీఎం జయలలిత, బీజేపీ నేత ఖష్భూల ప్రస్తావన తీసుకొచ్చిన విజయ్... మీరు కూడా రాజకీయాల్లోకి వెళ్లండని త్రిషకు సలహా ఇచ్చినట్లుగా సమాచారం. ఈ సలహా మేరకు రాజకీయ తెరంగేట్రంపై దృష్టి సారించిన త్రిష... కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఖుష్బూ ఆదిలో కాంగ్రెస్‌తోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆమధ్యే ఆమె కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఈ క్రమంలో తమిళనాడుకు సంబంధించి కాంగ్రెస్‌లో చేరితే మంచి అవకాశాలు చేజిక్కించుకోవచ్చనే అంచనాలతో త్రిష సాగుతున్నట్లు సమాచారం.