ధనుష్, మేఘ ఆకాష్ జంటగా టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ వాసుదేవ్ డైరెక్షన్ లో తెరకెక్కికిన యాక్షన్ థ్రిల్లర్ తూటా. న్యూ ఇయర్ కానుకగా నేడు ఈ మూవీ విడులైంది.
కథ: బి.టెక్ చదువుతున్న రఘు(ధనుష్), కాలేజ్ క్యాంపస్ కి షూటింగ్ కొరకు వచ్చిన డెబ్యూ హీరోయిన్ లేఖ( మేఘా ఆకాష్) ఇద్దరు మొదటి చూపులోనే ప్రేమలో పడతారు. అనాధ అయిన లేఖకు ఇష్టం లేకపోయినా.. తనను పెంచి పెద్ద చేసిన సేతు వీరస్వామి సినిమాలలో నటించమని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆమెతో చెడుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇది నచ్చని లేఖ…రఘుతో కలిసి అతని ఇంటికి వెళ్ళిపోతుంది. లేఖను సేతు వీరస్వామి బ్లాక్ మెయిల్ చేసి రఘు నుండి విడిపోయి సినిమాలలో నటించేలా చేస్తాడు. ఐతే నాలుగేళ్ళ తరువాత ముంబై లో ఆపదలో ఉన్నలేఖను రఘు అన్నయ్య గురు(శశి కుమార్) కాపాడతాడు. అసలు నాలుగేళ్ళ తరువాత ముంబైలో లేఖకు వచ్చిన సమస్య ఏమిటి? ఆమె సమస్యను ఎప్పుడో ఇంటిలో నుండి పారిపోయిన రఘు అన్నయ్య గురు ఎలా కాపాడాడు? అసలు లేఖ, రఘు, సేతు వీర స్వామి కథలోకి గురు ఎలా ఎంటరయ్యాడు? చివరికి రఘు, లేఖ ల ప్రేమ కథ ఎలా ముగిసింది అనేది మిగతా కథ…
ప్లస్ పాయింట్స్: ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే అది లీడ్ పెయిర్ అయిన ధనుష్, మేఘా ఆకాష్ లు. ఒకరంటే ఒకరికి చచ్చేంత ఇష్టం ఉన్న యంగ్ లవర్స్ గా వారి నటన సహజంగా ఉంటుంది. వారిద్దరి మధ్య నడిచే రొమాన్స్, కెమిస్ట్రీ సీరియస్ గా సాగే కథలో ప్రేక్షకుడికి కొంచెం ఉపశమనం కలిగేలా చేస్తుంది. హై ఇంటెన్స్ తో సాగే సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ లో ధనుష్ యాక్టింగ్ ఆకట్టుకొనేలా సాగింది. ధనుష్ తూటా మూవీ మొత్తం అన్నీ తానై నడిపాడు. యాక్షన్ సన్నివేశాలతో పాటు, ఉత్కంఠ రేపే సీన్స్ నందు ఆయన తన నటనతో ఆకట్టుకున్నారు. ప్రధాన విలన్ రోల్ చేసిన సేతు వీర స్వామి నటన పాత్రకు తగ్గట్టుగా వాస్తవానికి దగ్గరా సాగింది. ధనుష్ ఫ్రెండ్ గా చేసిన సునైన తన పాత్ర పరిధిలో ఆకట్టుకుంది.
నేపథ్యంతో పాటు సాగే పాటలు అలరిస్తాయి. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన ఫస్ట్ హాఫ్ మరియు సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు పాటలు చాలా బాగున్నాయి. బీజీఎమ్ కూడా సన్నివేశాలకు తీవ్రతను జోడించింది.
మైనస్ పాయింట్స్: కథే ఈ మూవీకి ప్రధానమైన బలహీనత. క్లిష్టమైన కథకు అంతకన్నా క్లిస్టమైన స్క్రీన్ ప్లే రాసుకొని ప్రేక్షకులకు దర్శకుడు పజిల్స్ విసిరాడు. మొదటి సగం మొత్తం అసలు తప్పిపోయిన అన్నకు వీరి ప్రేమ కథకు సంబంధం ఏమిటనే సస్పెన్స్ తో కథను నడిపిద్దామని చూసినా అది అంతగా వర్క్ అవుట్ కాలేదు. ఒక్క చూపులో హీరోయిన్ ఒక సాధారణ కాలేజ్ స్టూడెంట్ ప్రేమలో పడటం..సింగిల్ గా హీరో పోలీసుల బలం, మాఫీయా సపోర్ట్ ఉన్న విలన్స్ ని ముంబై వెళ్లి ఎదిరించడం నమ్మ శక్యం కాదు. ఎప్పుడో ఇంటి నుండి పారిపోయిన అన్నయ్య ముంబైలో ఆపదలో ఉన్న హీరోయిన్ కాపాడటం వంటివి వాస్తవానికి చాలా దూరంగా అనిపిస్తాయి. కథలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నట్లు హీరో అన్న పాత్రను(శశి కుమార్) పరిచయం చేసి చివరికి ఆయన పాత్ర సెకండ్ హాఫ్ లో రెండు మూడు సన్నివేశాలకు పరిమితం చేశారు. ఇక సెకండ్ హాఫ్ బోరింగ్ సీరియస్ నేరేషన్ తో ఇబ్బంది పెట్టేశారు. ఒక దశలో ఈ కథ ఎక్కడికి వెళుతుంది అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా సింపుల్ గా తేల్చిపారేశారు.
సాంకేతిక విభాగం: కథలో భాగంగా నేపథ్యంలో సాగే దర్బుక శివ అందించిన పాటలు బాగున్నాయి. ఆయన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ప్రవీణ్ ఆంటోని ఎడిటింగ్ పరవాలేదు. యాక్షన్ థ్రిల్లర్స్ కి సుదీర్ఘమైన నిడివి కంటే కూడా క్రిస్పీగా ఉంటే నిడివి ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ చాల బాగుంది. స్క్రీన్ ప్లే అండ్ ఫిల్మ్ మేకింగ్ లో ట్రెండ్ సెట్టర్ గా చెప్పుకొనే దర్శకుడు గౌతమ్ మీనన్ మేకింగ్ లో మొనాటమీ ఎక్కువైంది. ఆయన ప్రతి సినిమా గత సినిమాలను పోలివుండటం బలహీనతగా మారుతుంది. తూటా విషయంలో కూడా అదే జరిగింది. ఎక్కడా ఎంటర్టైన్మెంట్ కి తావులేకుండా ఆయన తూటా మూవీని సీరియస్ గా నడిపించారు. క్లిష్టమైన కథను చెప్పే విధానంలో తడబడ్డారు. కథలో డిఫరెంట్ లేయర్స్ ఉన్నప్పటికీ ప్రేక్షకుడికి ఆసక్తి కలగపోగా భారంగా ఫీలవుతాడు. తన హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఈ మధ్య విజయం సాధించడం లేదు.
తీర్పు: ధనుష్ హీరోగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన తూటా మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. వినోదానికి చోటు లేకుండా ఆయన తెరకెక్కించిన సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకుడిని మెప్పించడంలో పూర్తిగా విజయం సాధించలేదు. వాస్తవానికి దూరంగా ఆయన ఎంచుకున్న క్లిస్టమైన కథను ఇంకా క్లిస్టమైన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుడిని గందరగోళానికి గురిచేశారు. ధనుష్, మేఘా ల లవ్ స్టోరీ, వారి మధ్య కెమిస్ట్రీ, రొమాన్స్, దర్బుక శివ సాంగ్స్ ఈ చిత్రంలో ఆహ్లాదం కలిగించే అంశాలు. హాలీవుడ్ లాంటి సీరియస్ క్రైమ్ అండ్ థ్రిల్లర్స్ చూసేవారికి ఈ మూవీ నచ్చే అవకాశం కలదు.
నటీనటులు : ధనుష్, మేఘా ఆకాష్, సునైనా, శశి కుమార్, సెంథిల్ వీర స్వామి.
దర్శకత్వం : గౌతమ్ మీనన్
నిర్మాతలు : జి.రామ కృష్ణా రెడ్డి, తాతా రెడ్డి
సంగీతం : దర్బుక శివ
సినిమాటోగ్రఫర్ : జామూన్ టి జాన్, మనోజ్ పరమహంస, ఎస్ ఆర్ కథిర్
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
రేటింగ్ : 2.5/5.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa