తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దర్బార్’ సినిమాను కొని డిస్ట్రిబ్యూటర్లుగా తాము నష్టపోయామని, నష్టాలకు తనను బాధ్యుడిని చేస్తూ వ్యాజ్యాన్ని దాఖలు చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు బెదిరిస్తున్నారని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో మురుగదాస్ పేర్కొన్నాడు. తనకు డిస్ట్రిబ్యూటర్ల వల్ల హాని ఉందని, రక్షణ కల్పించాలని కోర్టుకు విన్నవించాడు. ‘దర్బార్’ సినిమా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఈ సినిమా వల్ల తాము నష్టపోయామని కొందరు డిస్ట్రిబ్యూటర్లు బహిరంగంగానే ప్రకటించారు. రజినినీ కలిసి ‘దర్బార్’ సినిమా నష్టాలను గురించి వివరించాలనుకున్న డిస్ట్రిబ్యూటర్లకు నిరాశే మిగిలింది. గత వారంలో చెన్నైలోని రజినీ నివాసానికి వెళ్లి కలిసేందుకు డిస్ట్రిబ్యూటర్లు యత్నించగా.. వారిని అనుమతి లభించలేదు. దర్శకుడు మురుగదాస్‌ను కలవాలని ప్రయత్నించినప్పటికీ ఇదే పరిస్థితి ఎదురుకావడంతో ఇక లాభం లేదనుకున్న డిస్ట్రిబ్యూటర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్న నిర్ణయానికొచ్చారు. అయితే.. ఈ వివాదంలో రజినీకాంత్‌కు, దర్శకుడు మురుగదాస్‌కు రజినీ అభిమానులు మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ‘దర్బార్’ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలనే తెచ్చిపెట్టిందని, లాభాలు రాకుండానే డిస్ట్రిబ్యూటర్లలో కొందరు సినిమా విడుదలైన నాలుగు రోజుల తర్వాత రజినీతో కలిసి నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చారా అని సోషల్ మీడియాలో రజినీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే రజినీపై, ఆయన సినిమాపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని వాదిస్తున్నారు. ఈ వివాదం ఎంతవరకు వెళ్లుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa