రచనశ్రీ దత్త
సాధారణ మనుషులుగా మనమందరం సినీ జీవితాలపై ప్రత్యేకమైన ఆసక్తి కలిగి ఉంటాం. సినీ ఆర్టిస్టుల జీవితాలలో చోటు చేసుకునే అతి చిన్న సంఘటన కూడా సినిమాలలానే మనలో ఎంతో మందికి వినోదం అన్నది తప్పక ఒప్పుకోవాల్సిన సత్యం. కానీ వారికి మామూలు మనుషులలానే కష్టాలు ఉంటాయి అని గుర్తించాలి అంటే కొంచెం ఇబ్బంది పడతాము కూడా. దానికి నిదర్శనంగా ఎన్నో ఉదంతాలు ప్రత్యక్షంగా చూసాము. అందులో భాగంగా ఎంతో మంది సినీ ఆర్టిస్టులు తమ వ్యథలు పంచుకోవటానికి ముందుకు వచ్చినా వాటిలో దాదాపు అన్నీ పబ్లిసిటీ స్టంట్లనే చాలా మంది భావిస్తారు కూడా.కానీ వారికి కష్టాలు,కన్నీళ్ళు ఉంటాయి అని గుర్తించాలంటే వాళ్ళను ఆర్టిస్టుల్లా కాక మన లాంటి మనుషులుగా చూసే సంస్కృతి రావాల్సిన అవసరం ఉంది.
కార్డు ఉన్నా,కార్డు లేకపోయినా జూనియర్ ఆర్టిస్టుల కష్టాలు మాత్రం అలా దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. మన సినిమాల్లో కనిపించే ప్రతి సినిమాలో జూనియర్ ఆర్టిస్టుల శ్రమ ఎంతో ఉంది. కానీ పట్టుమని పది మంది జూనియర్ ఆర్టిస్టుల పేర్లు చెప్పమంటే మనలో ఎంత మంది చెప్పగలరు? వారికి ఆగకుండా కొనసాగే పాత్రలు సినిమాలలో ఉండవు. వారిని ప్రేక్షకులు గుర్తు పెట్టుకునేంత స్థాయిలో వారికి ఆదరణ కూడా ఉండదు. కానీ వారు లేకపోతే సినిమా నడవదు.
మనం చూసే టాగూర్ సినిమాలో కోర్టు సీనుకైనా, బాహుబలిలో యుద్ధానికైనా, సైరా లో అయిన సరే సినిమాను అత్యున్న స్థాయికి తీసుకువెళ్లే పరిశ్రమలో వారి కృషి అనంతం. అంత దాకా ఎందుకు జూనియర్ ఆర్టిస్టులు సీనియర్ ఆర్టిస్టుల రక్షణ కోసం నిలబడిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ వారి శ్రమకు తగిన గుర్తింపు లేదా వారికి ఉండాల్సిన కనీస హక్కులు నిజంగా వారికి ఉంటున్నాయా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది.
ఇవేమీ నా వ్యక్తిగత అభిప్రాయాలు కాదు. కొందరు జూనియర్ ఆర్టిస్టులు (రేఖ, ఉమావతి, సుభాని, అప్పారావు ) ముందుకు వచ్చి తమ ఆవేదనలను ప్రత్యక్షంగా పంచుకున్నారు. ఇంకొందరు తమ పేర్లను బయట పెట్టవద్దని విన్నవించడం వల్ల వారి ద్వారా కూడా తెల్సుకున్నవాటిలో కామన్ గా ఉన్న విషయాలను విశ్లేషిస్తే వచ్చిన అవగాహన ఇది.( రేడియో ఆవిర్భవ యు ట్యూబ్ చానల్ లో ‘నేటి సౌదామిని ‘కార్యక్రమంలో ఉమావతి,రేఖ గార్ల ఇంటర్ వ్యూలు , ఫేస్ బుక్ లైవ్ లో సుభాని ,అప్పారావు ల వ్యథలను కూడా మీరు ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.)
జూనియర్ ఆర్టిస్టులలో ఉన్న ప్రధాన కష్టం కార్డు ఉండటం,కార్డు లేకపోవటం రెండు కూడా. కార్డు ఉన్న ఆర్టిస్టుకు 600 రూపాయలు (500 పే మెంట్, 100 రూపాయలు కన్వే యన్స్ ) ఇవ్వటం జరుగుతుంది. కానీ కార్డు లేని ఆర్టిస్టులకు 300 రూపాయలు ఇవ్వవచ్చు,ఇంకా ఎక్కువ ఇవ్వాలంటే అది వ్యక్తిగత లాభాలను అనుసరించి ఉంటుంది. ఇలా కార్డు లేకపోవటం వల్ల తమకు సగమే పేమెంట్ వస్తుందని భావించిన కార్డు లేని ఆర్టిస్టులు కార్డుకి అయ్యే వేలు ఖర్చు పెట్టి మరి తీసుకుంటారు. వాళ్ళు కార్డు ఉన్న ఆర్టిస్టులు అయ్యాక మళ్ళీ షూటింగ్ లు రావు. ఎందుకంటే ఇంతే తెలివిగా ఆలోచించే అవతలి వర్గం కార్డు లేని ఆర్టిస్టులకే ఇవ్వడం వల్ల. కార్డు లేకపోతే వెంటనే పే మెంట్లు ఉంటాయి. కానీ కార్డు ఉంటే 15 రోజులు మినిమమ్, అది నెల రెండు నెలలకు పొడిగించవచ్చు. కానీ చాలా సార్లు భారీ సినిమాల్లో నటించినప్పుడు చాలా మంది ఉన్నారనే నెపంతో ఎంతో మంది పేమెంట్స్ ను మిస్డ్ లిస్టులో ఉంచుతారు. ఈ లోపు వారికి ఇంకో షూటింగ్ వస్తే దీని గురించి మళ్ళీ మళ్ళీ అడిగితే షూటింగ్ కి పిలవరేమో అన్న భయంతో ఇంకా దాన్ని పక్కన పెట్టేస్తారు.
చాలా సినిమాల్లో కలర్స్ జూనియర్ ఆర్టిస్టుల బట్టలపై పడతాయి.అప్పుడు ఆ బట్టల ఖర్చులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో చిన్న రంగు పడిందనో లేక పడలేదనో సాకులు చెప్పి తప్పించుకోవడానికి చూస్తారు. జూనియర్ ఆర్టిస్టులు కార్డులు ఉన్నవారు 3,800 పైనే ఉన్నారు. కానీ కార్డు లేని వారు దీనికి రెట్టింపు ఉంటారు. ఇంకా తెలివిగా వ్యవహరించాలనుకుంటే మన చుట్టూ ఉండే సినిమా పిచ్చి ఉన్న ఎవరోఒకరిని ఆ రోల్స్ కి తీసుకున్న ప్రశ్నించే దిక్కు లేదు. అసలు కార్డు ఉన్నందు వల్ల వచ్చే ప్రత్యేక హక్కులు ఏమిటో కూడా వారికి తెలియని పరిస్థితి.
ఈ మధ్య చిత్రపురిలో ఆర్టిస్టుల ఇళ్ల విషయంలో అవకతవకలు జరిగాయని ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి. ఆర్టిస్టులకు ఇవ్వాల్సిన స్థలాల్లో ఎవరున్నారు? ఇంకో విషయం ఏమిటంటే చాలా సులభంగా కార్డులు పుట్టించవచ్చని, అలాగే మొదట ఇళ్ల కోసం 250 తో మొదలు పెట్టి ఎక్కువ కట్టిస్తూ ,చివరకు ఆర్టిస్టులు కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు దానిని తమ వ్యాపారానికి వాడుకున్నారని 25 ఏళ్ల నుండి జూనియర్ ఆర్టిస్టుగా ఉన్న సుభాని గారు వ్యథను పంచుకున్నారు.
ఇక పోతే స్త్రీల విషయానికి వస్తే జూనియర్ ఆర్టిస్టుల్లో అమ్మాయిల్లో మంచి రిచ్ డ్రెస్సింగ్ ఉన్నవారినే పట్టించుకుంటారు. తినడానికి తిండే లేని వారు ఇంకా అంత ఖరీదైన దుస్తులు ఎలా కొనగలరు? ఇలా ఎన్నో జూనియర్ ఆర్టిస్టుల సమస్యలు విన్న కొద్ది వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
ఒక్క విషయం ఆలోచించండి. ఈ జూనియర్ ఆర్టిస్టుల ద్వారా జీవితాలు గడిపే ఏజెంట్లు వారి లాంటి దుస్థితిలోనే జీవితాలు గడుపుతున్నారా? లేదే ! ఎవరైనా ధైర్యం చేసి ముందుకు వస్తే ముందు వచ్చే మాట మీ కార్డు రద్దు. కరోనా వల్ల బాధ పడుతున్నానని కార్డు ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ రేఖ గారు చెప్పినందుకు వెంటనే ఆఫీసుకు పిలిపించి కార్డు రద్దు అని ,అలా చెప్పినందుకు దూషించటం కూడా జరిగింది. కానీ రేఖ గారికి సాయం అందించటానికి ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాధ్ గారు ,శంకర్ గారు ఇంకా ఎందరో ముందుకు వచ్చి భరోసాను ఇచ్చారు కానీ అదే యూనియన్ వారు ఆమె మీద వివిధ పుకార్లు పుట్టించారు.
ఇక అసలు విషయానికి వద్దాము. ఆర్టిస్టుల కోసం ఎంతో మంది సినీ నటులు విరాళాలు ఇచ్చారు. ఇన్ని కోట్లలో విరాళాలు వస్తున్నప్పుడు అవి ఎంత మందికి చేరుతున్నాయి అనే జవాబుదారీతనంతో ఎందుకు పెద్దలు వ్యవహరించడం లేదు. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్నట్టు ఎంతో మంది సహృదయంతో ముందుకు వస్తున్నా వారు ఇచ్చే విరాళాలకు జవాబుదారీతనం వ్యవహరించే బాధ్యత మాత్రం పెద్దలు ఎందుకు తీసుకోవడం లేదు?
రోజు జూనియర్ ఆర్టిస్టులకు ఓ ఆడియో నాయకుల తరపున వస్తుంది. దానిలో చెప్పేది ఏమిటంటే క్రమశిక్షణతో వ్యవహరించమని. కానీ 3,800 పైగా ఉన్నారు కార్డు ఉన్న ఆర్టిస్టులు ఉంటే వారిలో రోజుకు 30 మందికి మాత్రమే అందుతుంటే ,అందులో ఎవరికి ఎప్పుడూ అందుతున్నది ముందు తెలియకపోతే వారి ఆకలికి క్రమశిక్షణ ఎలా ఉంటుంది? వ్యవస్థలో క్రమశిక్షణ లేకపోతే మనుషుల్లో ఎలా ఉంటుంది? ఎవరికి ఏ రోజు ఇస్తున్నారో లిస్టులు పెట్టకపోతే తమకు అసలు అందుతుందో,లేదో అన్న అనుమానం రావడంలో తప్పేముంది? అందుకని ఆకలితో చావలేక దాటలేవరైనా ఉన్నారేమోనని అర్థించడంలో తప్పేముంది?
ఎవరికి పంచుతున్నారు అనే జవాబుదారీతనం ఇవ్వడానికి నాయకులు సిద్ధంగా లేరంటే దాని అర్ధం ఏమిటి? లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ఎలాగో గడిపితే విరాళాలు మిగులుతాయనా? ఏమో వీటన్నిటికి సమాధానం వారి మనసాక్షే చెప్పాలి.
దీనిలో ఉన్న ఇంకో కోణం ఏమిటంటే కొందరు ఆర్టిస్టులు తమ కష్టాలకు పరిష్కారం కోసం వచ్చారు ఆవిర్భవ సినీ సేవ సమితి వద్దకు. ఇంకొందరుపబ్లిసిటీ స్టంట్ కోసం వచ్చారు. కష్టాలు ఇన్ని ఉన్నప్పుడూ పరిష్కారం దొరకాలంటే ముందు సమస్యలు అందరికీ తెలియాలి. కానీ కష్టాలను పబ్లిసిటీ స్టంట్లగా వాడుకునే వారు ఉంటే సాయం చేసే మానవత్వం నశిస్తుంది. ఇది దీనిలోని ఇంకో కోణం.
ఏది ఏమైనా జూనియర్ ఆర్టిస్టుల కష్టాలు వెలుగులోకి వస్తేనే వాటికి పరిష్కారం దొరుకుతుంది. కానీ ఆ సమస్యలను ముందుకు తెచ్చినవారు లాలూచి పడకుండా నిజంగా నిజాయితీతో ముందుకు సాగితే ఇప్పటికే స్పందిస్తూ తమ వంతు సహకారం అందిస్తున్న దాతల దాతృత్వానికి సార్ధకత ఏర్పడుతుంది.
నాయకుల జవాబుదారీతనం, ఆర్టిస్టుల నిజాయితీ మాత్రం ప్రస్తుతం మన ముందున్న ముఖ్య విషయాలు. ఎందుకంటే ఇక్కడ వారిని ఆదుకోవడానికి ఎంతో మంది ముందుకు వస్తున్నారు. వారి నిజాయితీ, తమ హక్కులను స్వలాభం కోసం అమ్ముకొని ప్రవృత్తి వారిలో అంతర్లీనంగా ఉంటేనే ఈ సమస్య పరిష్కారమవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa