శ్రీనివాస కళ్యాణం చిత్రీకరణలో ఒక దశలో తనకు కూడా పెళ్లి చేసుకోవాలనే భావన కలిగిందని యువ కథానాయిక రాశీ ఖన్నా తెలిపింది. సినిమా అంతగా తన హృదయాన్ని తాకిందని చెప్పింది. ఆదివారం (ఆగస్టు 5) శ్రీనివాస కళ్యాణం సినిమా ప్రత్యేక ప్రదర్శన వేశారు. ఈ సినిమా చూసిన తర్వాత రాశీ ఖన్నా విలేకరులతో మాట్లాడింది. సినిమా గురించి ఆసక్తికర విశేషాలు చెప్పింది. ఉత్తరాదికి చెందిన అమ్మాయిని కావడం వల్ల తెలుగు పెళ్లిళ్ల గురించి తనకు తెలియదని రాశీ ఖన్నా తెలిపింది. తెలుగువారి పెళ్లిళ్లకు హాజరైనా.. వధూవరులతో ఫొటో దిగి రావడమే తప్ప సంప్రదాయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదని ఆమె చెప్పింది. శ్రీనివాస కళ్యాణం సినిమాతో తెలుగు పెళ్లి తంతుల పరమార్థం తెలిసిందని చెప్పుకొచ్చింది.
తెలుగు పెళ్లిళ్లలో తలంబ్రాలు ఎందుకు పోస్తారు? బాసికం ఎందుకు కట్టుకుంటారు? తలపై జీలకర్ర బెల్లం ఎందుకు పెడుతారు.. తదితర విషయాలను శ్రీనివాస కళ్యాణం సినిమాతో తెలుసుకున్నానని రాశీ తెలిపింది. సినిమా చేస్తున్నంతసేపు తానూ ఓ తెలుగు అమ్మాయిలానే ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చింది.
భవిష్యత్తులో తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాశీ నవ్వుతూ చెప్పింది. ‘తెలుగు అబ్బాయిని చేసుకోకపోయినా.. నా పెళ్లి ఇలా జరిగితే బాగుంటుంది అనుకుంటున్నా. నాకు ఎప్పుడు పెళ్లి జరిగినా ఈ సినిమాను గుర్తు చేసుకోవడం మాత్రం ఖాయం’ అని రాశీ అంది.ఆదివారం ప్రత్యేక ప్రదర్శనలో శ్రీనివాస కళ్యాణం సినిమా పూర్తిగా చూశానని రాశీ చెప్పింది. ‘కథ వినేటప్పుడే ఓ మంచి సినిమా తీస్తున్నారని నాకు తెలుసు. సినిమా చూస్తున్నప్పుడు దాన్ని మించి ఉందనిపించింది. సినిమా చూసినంతసేపు భావోద్వేగానికి గురవుతూనే ఉన్నా. క్లైమాక్స్‌లో కన్నీరు ఆగలేదు. దర్శకుడు సతీశ్ వేగేశ్న పాదాల్ని తాకా’ అని రాశీ చెప్పుకొచ్చింది. నేనే కాదు నా చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా క్లైమాక్స్‌లో ఏడుస్తూ కనిపించారు. సాధారణంగా సినిమా చూసి అబ్బాయిలు కంటతడిపెట్టరు. కానీ, ఈ షోలో అబ్బాయిలు కూడా ఏడ్వడం నేను చూశా’ అని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. ‘తొలిప్రేమ’ తర్వాత తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రం శ్రీనివాస కళ్యాణం అని రాశీ పేర్కొంది.
ఓ జంట ప్రేమ నుంచి పెళ్లి వరకు ఎలా ప్రయాణం చేసింది అనేదే ‘శ్రీనివాస కల్యాణం’ అని రాశీ తెలిపింది. కుటుంబ అనుబంధాలు, విలువలతో కూడిన కథాంశం ఇదని చెప్పింది. నితిన్ మంచి నటుడని పేర్కొన్న రాశీ.. రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్, జయసుధ, ఆమని, నరేష్ లాంటి సీనియర్ నటులతో కలిసి పనిచేయడం సంతృప్తినిచ్చిందని తెలిపింది. సినిమాలు హిట్టైనా, ఫ్లాప్ అయినా.. మంచి కథల్లో నటించాలనేదే తన ఆలోచన అని రాశీ చెప్పింది. ప్రస్తుతం ఈ భామ తమిళంలోనే పలు సినిమాల్లో నటిస్తోంది. తెలుగులోనూ ఓ సినిమా ఒప్పుకున్నట్లు తెలిపింది. దాని వివరాలు త్వరలోనే ప్రకటిస్తారని చెప్పింది. దిల్ రాజు నిర్మాణంలో నితిన్, రాశీ ఖన్నా జంటగా నటించిన శ్రీనివాస కళ్యాణం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa