సూపర్ స్టార్ మహేష్ బాబును "మహర్షి" గా చూపించి, ఆ సినిమాతో జాతీయ అవార్డును గెలుచుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి. తెలుగులో ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో పని చేసిన వంశీ తదుపరి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేస్తున్నాడు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా విజయ్ కెరీర్లో 66వది కావడంతో తలపతి 66 గా పిలవబడుతుంది. ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మండన్నా హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో దిల్ రాజు కోలీవుడ్ నిర్మాణరంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవలనే పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ తాజాగా లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. 2023 సంక్రాంతి కానుకగా విడుదలవబోతున్న ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నటించబోతున్నాడంటూ పలు వార్తలు చిత్రసీమలో షికార్లు చేస్తున్నాయి. వంశీ, మహేష్ ల మధ్య మంచి రిలేషన్ ఉంది. అంతేకాకుండా వంశీ కూతురు ఆద్య,మహేష్ కూతురు సితార బెస్ట్ ఫ్రెండ్స్. ఇరు కుటుంబాలు ఫ్యామిలీ వెకేషన్ కి కూడా వెళ్తుంటాయి. వీరిద్దరి మధ్య ఉన్న ర్యాపొ తో వంశీ సినిమాలో మహేష్ చిన్న గెస్ట్ రోల్ లో కనిపించడం ఖాయం అని అంతా అనుకుంటున్నారు.