టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ తండ్రి ప్రముఖ లెజెండరీ డైరెక్టర్ టి. కృష్ణగారు. ఈ విషయం కొంతమందికి తెలియకపోవచ్చు. పిన్నవయసులోనే మెగాఫోన్ పట్టి నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, వందేమాతరం, ప్రతిఘటన, రేపటి పౌరులు వంటి విప్లవాత్మక సినిమాలను రూపొందించారు. కెరీర్లో నాలుగు నంది అవార్డులను, ఒక ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. కానీ, అనారోగ్య కారణాల వల్ల 36ఏళ్ళ వయసులోనే ఆయన కాలం చేశారు.
పక్కా కమర్షియల్ ప్రమోషన్స్ లో పాల్గొన్న గోపీచంద్ ను ఫ్యూచర్ లో డైరెక్షన్ చేసే అవకాశం ఉందా? అని ఒక విలేఖరి ప్రశ్నించాడు. అందుకు గోపీచంద్ సమాధానమిస్తూ... డైరెక్షన్ కు సంబంధించిన అన్ని విషయాలు నాకు తెలుసు. కాకపోతే, డైరెక్షన్ అనే సబ్జెక్టు థియరీలో నాకు మంచి పట్టుంది..కానీ ప్రాక్టీకల్ నాలెడ్జి ఎంతవరకుందన్నది నాకు కూడా తెలియదు. డైరెక్టర్...అంటే సినిమాకు సంబంధించిన అన్ని విషయాలపై అవగాహన ముఖ్యంగా ఓపిక ఉండాలి. నాకంత ఓపిక పట్టే తనం లేదు. నటుడిగా నేను చాలా ఆనందంగా, కంఫర్టబుల్ గా ఉన్నాను. నటుడిగా మరిన్ని కొత్త ప్రయోగాలు చేస్తా కానీ, డైరెక్షన్ జోలికి మాత్రం పోను.... అని చెప్పుకొచ్చారు.
గోపీచంద్ తన తండ్రిలాగా డైరెక్షన్ చెయ్యడనే విషయం పై అభిమానులకు పూర్తి క్లారిటీ వచ్చింది. నటుడిగా ప్రయోగాలు చేస్తానని చెప్పడంతో ఫ్యూచర్ లో విలన్ వేషాలు వేసే ఛాన్స్ ఉందేమో అని కొంతమంది ఆరా తీస్తున్నారు.