కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న శివకార్తికేయన్ ఇటీవల తెలుగులో కూడా తన మార్కెట్ ను పెంచుకోవడానికి చూస్తున్నాడు. ఆయన నటించిన "వరుణ్ డాక్టర్", "డాన్" చిత్రాలు తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యాయి. దీంతో తెలుగులో కూడా శివకార్తికేయన్ కు అభిమానులు ఏర్పడ్డారు.
శివకార్తికేయన్ డైరెక్ట్ తెలుగులో "ప్రిన్స్" అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. జాతిరత్నాలు ఫేమ్ కేవి అనుదీప్ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా, సురేష్ ప్రొడక్షన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ బ్యానర్స్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31న విడుదల కాబోతుంది.
తాజాగా శివకార్తికేయన్ మరొక తెలుగు సినిమాలో నటించబోతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలతో సూపర్ హిట్లు కొట్టిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో శివకార్తికేయన్ తన సెకండ్ తెలుగు మూవీని చెయ్యబోతున్నారని టాక్. ఈ సినిమాను కే.ఇ. జ్ఞాన్ వేల్ రాజా నిర్మించబోతున్నారు. ఈ విషయంపై అధికారికంగా క్లారిటీ రావలసి ఉంది.