బాహుబలి 1, 2 సినిమాలతో దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా తన క్రేజ్ ను, స్టార్డం ను పెంచుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతానికి డార్లింగ్ టాలీవుడ్ స్టార్ హీరోలకు అందనంత ఎత్తులో ఉన్నారు. ఇది మంచిదే...కానీ ఈ స్టార్డం ఎన్నాళ్ళు ఉంటుందో అని ప్రభాస్ అభిమానులు ఖంగారు పడుతున్నారు. ఎందుకంటే, బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఆ రేంజు హిట్ మరొకటి పడలేదు. సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాహుబలి రేంజులో కాకున్నా కనీసం హిట్టు కూడా కాకపోవడం ఫ్యాన్స్ ను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి.
'మహానటి' తో జాతీయస్థాయిలో సత్తాచాటిన నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కే, "అర్జున్ రెడ్డి" సినిమాతో టాలీవుడ్ ని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా "స్పిరిట్", కేజీఎఫ్ 1,2లతో కన్నడ చిత్రపరిశ్రమకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చిన ప్రశాంత్ నీల్ తో "సలార్", ఇంకా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో "ఆదిపురుష్" సినిమాలు ప్రభాస్ నుండి రాబోయే రోజుల్లో రానున్నాయి.
బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన, కమిటైన ఈ అన్ని సినిమాలను ఒక్కసారి గమనిస్తే, ఈ మూవీ డైరెక్టర్లందరూ కూడా గతంలో చేసింది ఒకటీరెండు సినిమాలే. సాహో, రాధేశ్యామ్ సినిమాల ఫలితాలతో ఈసారి నుండి కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వాలా వద్దా అని ప్రభాస్ ఆలోచనలో పడ్డాడంట.
తాజాగా ఈ విషయంపై ప్రభాస్ తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి కమిటైన సినిమాలను ఎలాగోలా కానిచ్చేసి, ఇకపై స్టార్ డైరెక్టర్లు, రెప్యుటెడ్ డైరెక్టర్లతోనే సినిమాలు చెయ్యాలని నిర్ణయించుకున్నాడట. ఈ క్రమంలో తదుపరి ప్రాజెక్ట్ ను తనకు "మిర్చి" వంటి సూపర్ డూపర్ హిట్టిచ్చిన కొరటాల శివ తో చెయ్యాలని అనుకుంటున్నాడట. ఇటీవలే ప్రభాస్ ను కలిసిన కొరటాల ఒక స్టోరీ లైన్ ను ప్రభాస్ కి వినిపించారని, అది ఆయనకు కూడా చాలా నచ్చినట్టు తెలుస్తుంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. ప్రభాస్ ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నందుకు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.