ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2018లో తెలుగుతెర‌పై రీ-ఎంట్రీ ఇచ్చిన తార‌లు వీళ్లు

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 31, 2018, 03:38 PM

ఖుష్బూ:`క‌లియుగ పాండ‌వులు`, `భార‌తంలో అర్జునుడు` త‌దిత‌ర చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టించిన అందాల తార ఖుష్బూ… పుష్క‌ర‌కాలం క్రితం `స్టాలిన్‌`, `య‌మదొంగ‌` చిత్రాల్లో ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించింది. ఆ త‌రువాత మ‌ళ్ళీ తెలుగు తెర‌పై స్ట్ర‌యిట్ ఫిల్మ్ తో క‌నిపించిన ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్ ఈ సంవ‌త్సరం `అజ్ఞాత‌వాసి`లో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇందులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి స‌వ‌తి త‌ల్లి పాత్ర‌లో ఖుష్బూ క‌నిపించింది.


లిజి:`ఆత్మ బంధం`, `మ‌గాడు`, `20వ శతాబ్దం` వంటి చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టించిన అందాల న‌టి లిజి… దాదాపు పాతికేళ్ళ‌కు పైగా గ్యాప్ తీసుకుని ఈ సంవ‌త్స‌రం `ఛ‌ల్ మోహ‌న్ రంగ‌` చిత్రంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో హీరోయిన్‌గా న‌టించిన మేఘా ఆకాష్ కు త‌ల్లి పాత్ర‌లో క‌నిపించింది లిజి. ప్ర‌స్తుతం `2 స్టేట్స్‌` చిత్రంలో ఓ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తోంది.


షామిలి:`అంజ‌లి`, `జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి` త‌దిత‌ర చిత్రాల్లో బాల‌న‌టిగా అల‌రించిన బేబి షామిలి… 2009లో విడుద‌లైన `ఓయ్‌`తో క‌థానాయిక‌గా షామిలిగా ప‌రిచ‌య‌మైంది. ఆ త‌రువాత భారీ విరామ‌మే తీసుకుని… ఈ సంవ‌త్సరం `అమ్మ‌మ్మ‌గారిల్లు` చిత్రంతో హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది షామిలి. ఈ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు.


సుప్రియ‌:ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలి చిత్రం `అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి`లో క‌థానాయిక‌గా న‌టించిన లెజండ‌రీ యాక్ట‌ర్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌రాలు సుప్రియ‌… ఆ త‌రువాత మ‌ళ్ళీ తెర‌పై క‌నిపించ‌లేదు. అయితే… ఈ ఏడాది `గూఢ‌చారి` చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషించి… ఆ సినిమా విజ‌యంలో భాగ‌మైంది.


ఇలియానా, ల‌య‌, అభిరామి: పుష్క‌ర‌కాలం క్రితం క‌థానాయిక‌గా సంచ‌ల‌నం సృష్టించిన ఇలియానా… ఆరేళ్ళ క్రితం బాలీవుడ్‌కి త‌న మ‌కాం మార్చింది. అయితే… ఈ సంవ‌త్స‌రం `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొని`తో హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇదే చిత్రంతో ఒక‌ప్ప‌టి క‌థానాయిక‌లు ల‌య‌, అభిరామి త‌ల్లి పాత్ర‌ల్లో న‌టించి… తెర‌పై పున‌రాగ‌మ‌నం చేశారు. అయితే… `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొని` వీరి రీ ఎంట్రీకి శుభారంభం ఇవ్వ‌లేక‌పోయింది.


జ‌య‌ప్ర‌ద‌:ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించ‌డ‌మే కాకుండా… ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ‌, శోభ‌న్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి వంటి అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ జోడీ క‌ట్టిన అందాల తార జ‌య‌ప్ర‌ద‌… ఈ ఏడాది `శ‌ర‌భ‌` చిత్రంతో తెలుగు తెర‌పై చాలా కాలం త‌రువాత ద‌ర్శ‌న‌మిచ్చింది. డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న హీరో త‌ల్లి పాత్ర‌లో త‌న న‌ట‌న‌తో మ‌రోసారి మెప్పించింది.


ప్రియారామ‌న్‌:`మావూరి మారాజు`, `శుభ సంక‌ల్పం` వంటి ప‌లు విజ‌యవంత‌మైన చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టించిన అందాల తార ప్రియా రామన్‌… ఈ ఏడాది `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు`తో తెలుగు తెర‌పై చాన్నాళ్ళ త‌రువాత ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇందులో శ‌ర్వానంద్‌కి త‌ల్లి పాత్ర‌లో ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్ క‌నిపించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa