డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్.. అయితే ఆ షిప్ ను నడపడం అంత సులభం కాదు. ముందు మంచి షిప్ ను ఎంచుకోవాలి. దాంట్లో ఎలాంటి లొసుగులు లేకుండా చూసుకోవాలి. తన టెక్నికల్ టీమ్ కరెక్ట్ గా కుదరాలి. అప్పుడే ప్రయాణం మొదలుపెట్టొచ్చు.. కానీ అన్ని ప్రయాణాలూ సాఫీగా ఉండవు. బట్ కొందరు దర్శకుల సినిమాలు.. వెలకట్టలేని అనుభూతిని ఇస్తాయి. మనసుపొరల్లో దాగిన ఎన్నో జ్ఞాపకాలను తట్టి లేపుతాయి. కళ్లముందే కొందరి జీవితాలు చూస్తున్నామన్న ఫీలింగ్ నిస్తాయి. ఈ ఇయర్ ఈ అన్ని ఫీలింగ్స్ ను ఇచ్చిన సినిమా కేరాఫ్ కంచరపాలెం..
5. కేరాఫ్ కంచరపాలెం
ప్రేమ.. విశ్వమంతా నిండి ఉన్నభావన. కానీ మనిషి తనకంటూ కొన్ని అడ్డుగోడలు గీసుకున్న తర్వాత ఇది మనసు కంటే సమాజానికి చెందినదిగా మారింది. అందుకే ప్రేమ మనసును బట్టి కాక కులాలు, మతాలను బట్టి రావాలనే ఆంక్షలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ప్రేమకు శతృవులు కులం, మంతం మాత్రమే. ఆ రెంటినీ కేంద్రబిందువుగా చేసుకుని.. అస్సలే మాత్రం రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఓ కొత్త దర్శకుడు సరికొత్తగా చేసిన అద్భుత ప్రయత్నం కేరాఫ్ కంచరపాలెం.
ఏమీ తెలియని వయసులో తన ప్రేమను గెలిపించమని దేవుడిని వేడుకుంటాడో కుర్రాడు. కానీ ఓడిపోతాడు. దేవుడిపై రాళ్లు వేసి నువ్వులేవు అనుకుంటాడు. అది అతని తండ్రి ఆత్మహత్యకు కారణమవుతుంది. అందుకు కారణం ఈ దేవుడే అని అతను మరో దేవుడిని నమ్ముకుంటాడు. టీనేజ్ లో ఓ అమ్మాయిని ప్రేమిస్తే.. కేవలం మతం కారణంగా తనతో విడిపోవాల్సి వస్తుంది. దీంతో ఆ దేవుడూ లేడనుకుంటాడు.. కట్ చేస్తే కాస్త థర్టీస్ లో మరో ప్రేమ. ఇదీ మతం వల్లే పోతుంది. ఇన్ని ఎదురు దెబ్బలు తిన్న ఆ మనిషి అన్నీ వద్దనుకుని సంతోషంగా ఉంటాడా..? ఉంటే ఎలా ఉంటాడు..
ఇన్ని వైవిధ్యాలను, వైరుధ్యాలను తన కథగా.. ఆ అన్నిటినీ కలుపుతూ దర్శకుడు వెంకటేష్ మహా రాసుకున్న స్క్రీప్లే సినిమాకే హైలెట్ గా నిలిచింది. దీనికి తోడు సినిమాను తన టైటిల్ ఉన్న ప్రాంతంలోనే చిత్రీకరించాడు. ఇది ఇప్పటి వరకూ ఎవరూ చేయని ప్రయోగం. అది సినిమాకు సహజత్వాన్ని ఆపాదించింది. మొత్తంగా ఈ యేడాది పరిశ్రమతో పాటు ప్రేక్షకులను, విమర్శకులను ఏకకాలంలో మెప్పించిన దర్శకుడు వెంకటేష్ మహా టివి5 సూపర్ ఎయిటీన్ టాప్ డైరెక్టర్స్ లో ఐదవస్థానంలో నిలిచాడు..
4. ఆర్ ఎక్స్ 100
నిజ జీవిత కథలు వెండితెరపై చాలా చూశాం. కానీ సినిమాగా మారేసరికి అవన్నీ హీరోయిజాన్ని ఆపాదించుకుంటాయి. బట్ తను ఎంచుకున్న ఊరును దాటకుండా.. ఓ కథను అద్భుతంగా నడిపించాడు ఆర్ఎక్స్ హండ్రెడ్ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి. మిడిల్ క్లాస్ అబ్బాయిని ప్రేమించే ఓ సంపన్నుల అమ్మాయి. తర్వాత అనుకోని పరిస్థితుల్లో వేరే పెళ్లి చేసుకుంటుంది. ఇంటర్వెల్ వరకూ నడిచిన ఈ కథ చూసిన చాలామంది ఇది ఎన్నో సినిమాల్లో చూశాం కదా.. ఆ ఇద్దరూ మళ్లీ కలుసుకుంటారులే అనుకున్నారు. కానీ దర్శకుడు సెకండ్ హాఫ్ లో చివరి అరగంట నడిపించిన కథనానికి ఎంటైర్ ఆడియన్స్ షాక్ అయ్యారు. ఓ తెలుగు సినిమాలో ఆర్ఎక్స్ హండ్రెడ్ లాంటి కథను ఊహించగలమా. హీరోయిన్నే విలన్. అదీ ప్రాణంగా ప్రేమించిన వాడిని చంపేస్తుంది.. అంతవరకూ సరే అనుకున్నా.. ఆ అమ్మాయి క్యారెక్టర్ ను ప్రెజెంట్ చేసిన విధానం.. ఇవన్నీ కలిపి ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. లిప్ లాకులున్నాయనీ, ఎక్స్ పోజింగ్ అనీ విమర్శించినా.. ఈ సినిమా అందరూ చూడాల్సిన సినిమా. చూశారు కాబట్టే ఈ యేడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది ఆర్ఎక్స్ హండ్రెడ్. అలాంటి డిఫరెంట్ కథను మనకందించిన దర్శకుడు అజయ్ భూపతి టివి5 సూపర్ ఎయిటీన్ టాప్ డైరెక్టర్స్ లో ఫోర్త్ ప్లేస్ లో నిలిచాడు.
3. గీత గోవిందం
ఇది ఓ చిన్న కథ. పరిమితమైన పాత్రలు. కుటుంబ బంధాలు, ఆత్మాభిమానాలు, ఆత్మన్యూనతలు నిండి ఉన్న పాత్రలు. కానీ ఆ పాత్రల మధ్య ఓ సంఘర్షణ ఉంటుంది. ఆ సంఘర్షణ నుంచి సున్నితమైన హాస్యాన్ని తీసుకున్నాడు దర్శకుడు. అది ప్రేక్షకులకు వందశాతం కనెక్ట్ అయింది. ఇంకేం ఇంకేం కావాలే అంటూ ఆ సినిమాకు ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేర్చారు. కానీ ఈ సినిమాను కథగా చూస్తే ఓ చిన్న పాయింట్. దాని చుట్టూ అల్లుకున్న కథనంతో ఎంటైర్ ఆడియన్ ను కట్టిపడేశాడు గీత గోవిందం దర్శకుడు పరశురామ్.
దర్శకుడు పరశురామ్ కథల్లో హ్యూమన్ ఎమోషన్స్ కు పెద్ద టేబుల్ ఉంటుంది. అదే గీతగోవిందంలోనూ కనిపిస్తుంది. దీనికి క్రేజీ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్నాల నటన తోడై సినిమాను మరోస్థాయికి తీసుకువెళ్లింది. ఆరంభంలోనే హీరో తప్పు చేస్తాడు. ఆ తప్పును దాటాలనుకునే టైమ్ లో చెల్లిపెళ్లి ఆ అమ్మాయి కుటుంబంతో ముడిపడి ఉంటుంది. దీంతో తన తప్పును మించిన అవమానాలు భరిస్తాడు. చివరికి ఆ అమ్మాయే కోరి వచ్చినా జీవితాంతం ఇలా ఉండలేనంటూ కుండబద్ధలు కొడతాడు. మొత్తంగా ఓ అద్భుతమైన సంఘర్షణను అత్యంత సున్నితమైన హాస్యంతో ముడిపెట్టి గీత గోవిందంను నడిపించిన విధానం సింప్లీ సూపర్బ్. అందుకే ఈ సినిమా ఏకంగా వంద కోట్లు కొల్లగొట్టింది. కేవలం 15కోట్ల బడ్జెట్ తో రూపొంది అంత కలెక్ట్ చేయడం అంటే అది దర్శకుడి ప్రతిభ కాక మరేంటీ.. చిన్న కాన్సెప్ట్ తో పెద్ద కమర్షియల్ విజయం సాధించిన పరశురామ్ టివి5 సూపర్ ఎయిటీన్ టాప్ డైరెక్టర్స్ లో థర్డ్ ప్లేస్ కొట్టేశాడు.
2. మహానటి
బయోపిక్.. ఒక వ్యక్తి జీవితాన్ని తెరకెక్కించడం అత్యంత రిస్కీ జాబ్. ఆ వ్యక్తి జీవితాన్ని తరచి చూడాలి. ఎన్నో తెలుసుకోవాలి. ఎవరినీ నొప్పించకూడదు. ఇక ఆ వ్యక్తి సినిమా పర్సన్ అయితే అభిమానుల నుంచీ వ్యతిరేకతలు వస్తాయి. అయినా రిస్క్ చేశాడు దర్శకుడు నాగ అశ్విన్. తెలుగులో బయోపిక్స్ ఆడవు అన్నదగ్గర్నుంచీ తన సినిమా ఇండియన్ పనోరమాలో ప్రదర్శించేంత వరకూ తీసుకువెళ్లాడు. అదే టైమ్ లో కమర్షియల్ గానూ సూపర్ సక్సెస్ అయ్యాడు. బయోపిక్ కు సంబంధించి పెద్ద టాస్క్.. సబ్జెక్ట్ కు తగ్గ ఫేస్ దొరకడం. దొరికితే ఆ స్థాయిలో నటించడం.. అదృష్టం కొద్దీ దర్శకుడు నాగ అశ్విన్ కు తన పాత్రకు తగ్గనటి దొరికేసింది. కీర్తి సురేష్. తన నటనే సినిమాకు హైలెట్. దర్శకుడి విజన్ లో కీర్తి నటించడంతో పాటు అచ్చంగా సావిత్రిని తలపిస్తూ తను పడ్డ కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. ఇక దర్శకుడుగా నాగ అశ్విన్.. నాటి కాలాన్ని అద్భుతంగా ప్రతిబింబించాడు. ఆ కాలపు పాత్రలను మరోసారి సృష్టించి శభాష్ అనిపించాడు.
మహానటి సావిత్రి బయోపిక్ మొదలైనప్పుడు ఇది ఆ కాలం వాల్లే చూస్తారు. ఇప్పటి యూత్ కు సావిత్రి ఎవరో తెలియదు కదా అని కూడా చెప్పుకున్నారు. కానీ అక్కడ సావిత్రిగా కీర్తి ఉంది కదా. అందుకే కీర్తి కోసం వెళ్లి సావిత్రితో ప్రేమలో పడిపోయింది నేటి యూత్. మొత్తంగా అద్భుతమైన కంటెంట్ తో కమర్షియల్ గానూ సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమాతో దర్శకుడు నాగ అశ్విన్ టివి5 సూపర్ ఎయిటీన్ టాప్ డైరెక్టర్స్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు..
1. రంగస్థలం
ఏ సినిమాకైనా కథే కీలకం. ఆ కథ వాస్తవ జీవితాలకు ఎంత దగ్గరగా ఉంటే అంత మంచి కథగా మారుతుంది. అలాంటి వాస్తవ సంఘటనలతో 1980ల నాటి నాటి మన గ్రామీణ వ్వవస్థ ఎలా ఉంది. అధికారం ఒకే వ్యక్తి చేతిలో బందీగా మారితే పరిణామాలు ఎలా ఉంటాయి. కులం చుట్టూ రాజకీయాలు ఎలా తిరిగాయి..? ఈ అన్ని అంశాలనూ ఒకే కథగా మార్చి సుకుమార్ సృష్టించిన రంగస్థలానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సుకుమార్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఓ మాస్ స్టోరీ తీసుకోవడం.. దాన్ని ఎటువంటి గందరగోళం లేకుండా సూటిగా చెప్పిన సినిమా కూడా ఇదే కావడం విశేషం.
రంగస్థలం.. కథను పకడ్బందీగా రాసుకున్నారు. చిన్నచిన్న అంశాలు మైనస్ గా ఉన్నా.. అద్భుతమైన కథనం, అభినయం ముందు అవన్నీ తేలిపోయాయి. లేడీస్ టైలర్ తర్వాత ఓ గ్రామీణ కులవృత్తి చేసుకునే వ్యక్తిని హీరోగా చూడ్డం ఇదే. ఇక రామ్ చరణ్ వంటి స్టార్ హీరో చెవుడు ఉన్న వ్యక్తిగా నటించేందుకు ఒప్పుకున్నప్పుడే ఈ కథలో దమ్ముందీ అనుకున్నారు ప్రేక్షకులు. వాళ్లు అనుకున్నదానికంటే ఎక్కువే చూపించాడు సుకుమార్. రంగస్థలంలో ప్రతి పాత్రా మెమరబుల్.. చిట్టిబాబు, కుమార్ బాబు, రామలక్ష్మి, రంగమ్మత్త, జగపతిబాబు, ప్రకాష్ రాజ్.. ఇలా ఏ పాత్రా సహజత్వానికి దూరంగా లేదు. అయితే ఈ కథను సుకుమార్ ఎండ్ చేసిన విధానం నాటి సమాజ గతిపై వేసిన బిగ్గెస్ట్ సెటైర్. పైకి ఎన్ని ఆదర్శాలు చెప్పినా.. మనసు పొరల్లో కులతత్వం ఎక్కడికీ పోదు అని చెప్పిన విధానం నేటికీ అప్లై అవుతుంది. అందుకే ఈ కథ అందరికీ కనెక్ట్ అయింది. దీనికి తోడు సంగీతం హైలెట్ గా నిలవడంతో రంగస్థలం దేశవ్యాప్తంగా ఈ యేటి మేటి చిత్రాల్లో 7వ స్థానం సంపాదించుకుంది.
మొత్తంగా సుకుమార్ ఓ అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించాడని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఒప్పుకున్నారు. ఈ మధ్యకాలంలో ఓ స్టార్ హీరో సినిమాకు ఇలా యూనానిమస్ గా హిట్ టాక్ రావడం ఇదే. రంగస్థలంతో రామ్ చరణ్ లోని గ్రేట్ యాక్టర్ ను కూడా ఆవిష్కరించిన సుకుమార్.. ఈ యేటి మేటి దర్శకుడుగా నిలిచాడు. టివి5 సూపర్ ఎయిటీన్ టాప్ డైరెక్టర్స్ లో టాప్ డైరెక్టర్ గా నంబర్ వన్ ప్లేస్ దక్కించుకుని మరోసారి గెలిచాడు.. కంగ్రాట్స్ సుక్కూ..
సో అదీ మేటర్.. ఈ యేడాది టాలీవుడ్ లో వచ్చిన ది బెస్ట్ డైరెక్టర్స్ లిస్ట్ లో నిలిచిన ఐదుగురు దర్శకులు వీళ్లే. మరి వీరు ఎందుకు ఆ ప్లేస్ కు వచ్చారు. కంటెంట్ కు, కమర్షియల్ హిట్ కు కారణమైన విషయాలేంటో చూశాం కదా.. కంటెంట్ కమర్షియల్ గానూ విజయం సాధించాలంటే ఆ దర్శకులకు కథనంపై పట్టుండాలి. ఆ పట్టుతోనే టాప్ లేపిన ఈ ఐదుగురు దర్శకులకు కంగ్రాట్యులేషన్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa