ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ సంవత్సరంలో బాక్సాఫీస్ విజేతలు

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 31, 2018, 03:25 PM

2018 లో చాలామంది స్టార్ హీరోలు నిరాశపరచిన మాట వాస్తవమే. కానీ కొందరు మాత్రం బాక్సాఫీస్‌ను భారీగా కుమ్మేసారు. పెద్ద సినిమాలు ఈ సారి మంచి వసూళ్లు సాధించాయి. పైగా వాటికి దీటుగా చిన్న హీరోల సినిమాలు కూడా కలెక్షన్ల ప్రభంజనం సృష్టించాయి. మరీ ముఖ్యంగా ఈ ఏడాది విజయ్ దేవరకొండ ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. ఈయన నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరి 2018లో బాక్సాఫీస్ విజేతలుగా నిలిచిన సినిమాల వివరాలు ఏంటో చూద్దాం..


రంగస్థలం..


ఈ ఏడాది ఎన్ని సినిమాలు వచ్చినా కూడా రామ్ చరణ్ దే అగ్రస్థానం. ఈయన హీరోగా నటించిన రంగస్థలం సినిమా 123 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అప్పటివరకు తెలుగు సినిమాకు కలగా ఉన్న 100 కోట్ల మార్కెట్ ను ప్రభాస్, చిరంజీవి మాత్రమే అందుకుంటే సెంచరీ కొట్టిన మూడో హీరోగా చరిత్ర సృష్టించాడు రామ్ చరణ్. సుకుమార్ కెరీర్ లోనే కాకుండా చరణ్ కెరీర్లో చిరస్థాయిగా మిగిలిపోయింది. ఈయన రంగస్థలంతో న‌టుడిగా ఎన్నో మెట్లు ఎక్కేశాడు.


అరవింద సమేత వీరరాఘవ..


2018 సంక్రాంతికి అజ్ఞాతవాసి సినిమాతో చరిత్రలో నిలిచిపోయే డిజాస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్జ.. దసరా కుదురుకున్నాడు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన అరవింద సమేత 95 కోట్ల షేర్ వసూలు చేసింది. ఎన్టీఆర్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్.


భరత్ అనే నేను..


స్పైడర్, బ్రహ్మోత్సవం సినిమాల పరాజయాలతో రేసులో వెనుకబడిపోయిన మహేష్ బాబుకు 2018 బాగానే కలిసొచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో ఈయన నటించిన భరత్ అనే నేను 93 కోట్ల షేర్ సాధించింది. 100 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం అబౌ యావ‌రేజ్ గా నిలిచింది. కానీ మ‌హేష్ కెరీర్లో మాత్రం ఇదే బిగ్గెస్ట్ హిట్. ఆయన కెరీర్లో శ్రీమంతుడు సినిమా 86 కోట్లు సాధిస్తే.. కొరటాల శివ మరోసారి మహేష్ బాబుకు భ‌ర‌త్ అనే నేను రూపంలో బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా ఇచ్చాడు. ఇందులో ముఖ్యమంత్రిగా అదరగొట్టాడు సూపర్ స్టార్.


గీత గోవిందం..


స్టార్ హీరోలు లేకపోయినా వాళ్ల‌కు ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక లాభాలు తీసుకొచ్చిన చిత్రంగా నిలిచింది గీతగోవిందం. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం ఏకంగా 68 కోట్ల షేర్ సాధించింది. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ కు మాత్రమే నచ్చిన విజయ్ దేవరకొండ.. గీతగోవిందం సినిమాతో కుటుంబ ప్రేక్షకులకు చేరువ‌య్యాడు. ఈ చిత్రం నిర్మాతలకు 50 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది. బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు.


మహానటి..


ఈ ఏడాది విడుదలైన మరో సంచలన సినిమా మ‌హాన‌టి. ఈ చిత్ర విజయం లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు మరింత ఊపు తీసుకొచ్చింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం 49 కోట్ల షేర్ వసూలు చేసింది. సావిత్రి బయోపిక్‌గా వచ్చిన మహానటికి నీరాజనాలు పట్టారు ప్రేక్షకలోకం. మ‌హానటి సినిమాలో సావిత్రి జీవితాన్ని తెర‌పై అద్భుతంగా ఆవిష్కరించారు దర్శకుడు నాగ్ అశ్విన్.


భాగమతి..


కొంతకాలంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్న అనుష్క.. ఈ ఏడాది మొదట్లో భాగమతి సినిమాతో వచ్చింది. చాలా వాయిదాల తర్వాత వచ్చిన ఈ చిత్రం 33 కోట్లు వసూలు చేసి విజయంగా నిలబడింది. అశోక్ తెరకెక్కించిన భాగమతి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది భాగ‌మ‌తి.


జై సింహా..
సంక్రాంతి పండుగ తనకు కలిసొస్తుందని మరోసారి నిరూపించుకున్నాడు బాలకృష్ణ. ఈయన నటించిన జై సింహ సంక్రాంతికి వచ్చి 30 కోట్లు వసూలు చేసింది. తక్కువ బిజినెస్ చేయ‌డంతో కేవ‌లం 30 కోట్లు మాత్ర‌మే వసూలు చేసినా కూడా హిట్ లిస్టులో నిలబడింది. అజ్ఞాతవాసి డిజాస్టర్ కావడం బాలయ్య సినిమాకు కలిసివచ్చింది.


తొలిప్రేమ..


2017 లో ఫిదా సినిమాతో సంచలన విజయం సాధించిన వరుణ్ తేజ్.. 2018 ఆ విజయాన్ని కంటిన్యూ చేశాడు. ఫిబ్రవరిలో ఈయన నటించిన తొలిప్రేమ సినిమా విడుదలైంది. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం 24 కోట్లు వసూలు చేసి వరుణ్ తేజ్ కెరియర్లో ఫిదా తర్వాత అతి పెద్ద విజయంగా నిలిచింది.


టాక్సీ వాలా..


గీత గోవిందం విజయంతో జోరుమీదున్న విజయ్ దేవరకొండ ఏడాది చివర్లో మరో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు.. అదే టాక్సీవాలా. రాహుల్ సంకృత్య‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 23 కోట్లకు పైగా వసూలు చేసి విజ‌య్ దేవ‌ర‌కొండ ఖాతాలో మ‌రో బ్లాక్ బస్టర్ చేరిపోయింది. టాక్సీవాలా కేవ‌లం 8 కోట్లు మాత్ర‌మే బిజినెస్ చేయ‌డంతో 23 కోట్ల‌కే బ్లాక్ బ‌స్ట‌ర్ స్టేట‌స్ అందుకుంది.


ఛ‌లో..


2018 సంచలన విజయాల్లో ఒకటిగా నిలిచింది ఛ‌లో. నాగశౌర్య హీరోగా వచ్చిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించాడు. ఫిబ్రవరి లో విడుదలైన ఈ చిత్రం నాగ‌శౌర్య మార్కెట్ తో సంబంధం లేకుండా 14 కోట్లు వసూలు చేసింది. పెట్టిన బడ్జెట్ కంటే రెండింతలు తీసుకొచ్చింది చలో సినిమా. అంతేకాదు 2018లో వ‌చ్చిన తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఛ‌లోనే.




ఆర్ఎక్స్ 100..


2017 లో అర్జున్ రెడ్డి వచ్చి ఇండస్ట్రీని కుదిపేసిన‌ట్లే 2018లో అదే జోనర్లో వచ్చి బాక్సాఫీస్ ను కుమ్మేసింది ఆర్ఎక్స్ 100. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్ పుత్ జంట‌గా వ‌చ్చిన ఈ చిత్రం కేవలం రెండు కోట్లతో తెరకెక్కి.. ఆర్ఎక్స్ 100 12 కోట్లకు పైగా వసూలు చేసింది.


గూడచారి..


అడవి శేష్ హీరోగా కొత్త దర్శకుడు శశికిరణ్ తిక్క తెరకెక్కించిన చిత్రం గూడచారి. కేవలం ఐదు కోట్ల బడ్జెట్తో హాలీవుడ్ రేంజ్లో ఈ చిత్రం తెరకెక్కింది. రొటీన్ స్టోరీ అయినా కూడా డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో గూఢచారిని బ్లాక్ బస్టర్ సినిమాగా నిల‌బెట్టారు అడవిశేష్. ఆయనకు తోడుగా నిలిచాడు దర్శకుడు శశికిరణ్. ఈ చిత్రం 10 కోట్ల వ‌ర‌కు షేర్ వ‌సూలు చేసింది.


వీటితో పాటు ఈ ఏడాది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌త్తా చూపించిన సినిమాలు మరికొన్ని కూడా ఉన్నాయి. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన నీది నాది ఒకే కథ.. రామ్ హ‌లో గురు ప్రేమ‌కోస‌మే.. రానా ప్ర‌మోట్ చేసిన‌ కేరాఫ్ కంచరపాలెం.. సుధీర్ బాబు సమ్మోహనం లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. నాని నిర్మించిన అ..! మంచి సినిమాగా నిలిచిపోయింది. ఇక డబ్బింగ్ సినిమాల్లో విశాల్ అభిమన్యుడు బ్లాక్ బస్టర్ గా నిలవగా.. ఏడాది చివర్లో వచ్చి కలెక్షన్ల పంట పండిస్తోంది కేజిఎఫ్. వ‌చ్చే ఏడాది ఈ విజ‌యాల శాతం ఇంకా పెర‌గాలని ఆశిద్ధాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa