మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ . ఈ చిత్రానికి సంబంధించి రీసెంట్‌గా విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘వందేమాతరం’ మంచి స్పందనను రాబట్టుకుని.. మ్యూజికల్ జర్నీని ప్రారంభించడానికి సరైన పాటగా నిలిచింది. తాజాగా ఈ సినిమాలోని రొమాంటిక్ లేయర్‌ని చూపించడానికి, మేకర్స్ సెకండ్ సింగిల్ ‘గగనాలను’ హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజ్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఫస్ట్ సింగిల్ కంపోజిషన్‌తో అందరినీ ఆకట్టుకున్న మిక్కీ జె మేయర్, గగనాల పాట కోసం ఒక ఆకర్షణీయమైన రొమాంటిక్ మెలోడీని కంపోజ్ చేశారు. లీడ్ పైర్ వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న లవ్ బర్డ్స్‌గా మెస్మరైజింగ్ కెమిస్ట్రీతో ఈ పాటను ఆకట్టుకున్నారు. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించగా, అర్మాన్ మాలిక్ ఆకట్టుకునేలా పాడారు. ఈ పాట విడుదల కార్యక్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఈ పాట మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా వుంది. పాట కంటే సినిమా మరో స్థాయిలో వుంటుంది. మనందరికీ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ వుంటారు. ఒకరిని ఒకరం జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ దేశాన్ని కాపాడే సైనికుడు 130కోట్ల మందిని తన కుటుంబంగా భావించి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. అలాంటి సైనికుల కోసం, వాళ్ళు చేసిన త్యాగాల కోసం, వాళ్ళ కథని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే గొప్ప ఉద్దేశంతో ఈ సినిమా చేశాం. థియేటర్స్‌లో మన దేశానికి రియల్ సూపర్ హీరోస్ అయిన వారి కథని చూసి ప్రేక్షకులంతా చాలా గర్వంగా ఫీలౌతారు. ఈ సినిమా మార్చి 1న థియేటర్స్‌లోకి వస్తుంది. తప్పకుండా చూడండి. మీ అందరికీ నచ్చుతుందని గర్వంగా చెబుతున్నానని అన్నారు. అనంతరం కాలేజ్ విద్యార్థులు అడిగిన కొన్ని ప్రశ్నలకు టీమ్ సమాధానాలిచ్చారు. అందులో వరుణ్ తేజ్‌ను మీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరు? అని అడుగగా.. ‘నేను నా అభిమాన హీరోయిన్‌నే పెళ్లి చేసుకున్నాను. మంచి కథలు వస్తే.. కచ్చితంగా ఆమె కలిసి మళ్లీ సినిమా చేస్తాను. లావణ్య కాకుండా నేను అభిమానించే హీరోయిన్ మాత్రం సాయిపల్లవి’ అని వరుణ్ తేజ్ అన్నారు. ఇంకా తన తర్వాత చిత్రం ‘మట్కా’.. అంతకు ముందు తను చేసిన ‘గద్దలకొండ గణేష్’ తరహాలో మాస్ చిత్రమని తెలిపారు. మంచి కథ కుదిరితే బాబాయ్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఉందని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు. కాగా, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.