సినిమా అంటే చాలా మందికి ఒక ఎమోషన్. చిన్నప్పటి నుంచీ చూసిన సినిమాల గురించి ఒక్కొక్కరూ ఒక్కో రకంగా స్పందిస్తూ ఉంటారు. కొందరు మాత్రమే ఆ స్పందనను రికార్డ్ చేస్తారు. అలా.. సుదీర్ఘ కాలంగా సినిమా జర్నలిస్ట్‌గా తనకున్న అనుభవాలు, అనుభూతులతో పాటు చిన్నప్పటి నుంచీ తను చూసిన సినిమా విశేషాలు, సంగతులను గురించి విపులంగా వివరిస్తూ సీనియర్ జర్నలిస్ట్ జీఆర్ మహర్షి ‘మార్నింగ్ షో’ అనే పుస్తకాన్ని రాశారు. యాభై యేళ్లుగా తను చూసిన సినిమాలతో పాటు పరిశ్రమలోని మార్పులు, కథ, కథనాల్లో వచ్చిన మార్పులను గురించి ఆలోచనాత్మక విశ్లేషణతో ఆయన రచించిన ఈ పుస్తకాన్ని జమిలి సాహిత్య, సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో దర్శకుడు కుమారస్వామి(అక్షర) ప్రచురించారు. తాజాగా ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రముఖ సెలబ్రిటీలు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. ‘షరతులు వర్తిస్తాయి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న కుమార స్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉంది. కుమారస్వామి ఎంతో కష్టపడి, నిబద్ధతతో ఈ పుస్తక ముద్రణ కోసం శ్రమించారు. అంతకంటే ఎక్కువగా తన ‘షరతులు వర్తిస్తాయి’ సినిమా కోసం కృషి చేశారు. త్వరలో విడుదల కాబోతోన్న ఆ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇక జిఆర్ మహర్షి గారితో నాకు చాలాకాలంగా పరిచయం ఉంది. వారు చిన్నతనం నుండి చూసిన సినిమాల సంగతులను తనకే సొంతమైన ఒక సెటైరికల్ వేలో రాశారు. ఈ పుస్తకం కేవలం సినిమా విశేషాలను గురించి మాత్రమే కాదు.. అనేక ఆలోచనలను కలిగించేలా ఉంది. ఒక్కసారి చదవడం మొదలుపెడితే.. ఇక ఆపలేం. అంత గొప్పగా మహర్షి గారు ఈ పుస్తక రచన చేశారు. ఇలాంటి పుస్తకాన్ని మనందరి ముందుకూ తెస్తున్న కుమార స్వామిని మరోసారి అభినందిస్తున్నానని అన్నారు.