నానక్ రామ్‌గూడలోని వివాదాస్పద స్థలంలో రిజిస్ట్రేషన్స్ ఆపించామని పేద సినీ కార్మికులకు ఇళ్ల నిర్మాణం చేస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, యాంకర్ సుమ కనకాల ఫెస్టివల్స్ ఫర్ జాయ్, శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో యూసుఫ్ గూడ కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఉచిత ఐ క్యాంప్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి వైద్యం చేయించుకోవాలని ఎదురుచూస్తున్న వారికి ఈ ఐ క్యాంప్ ఎంతో ఉపయోగ పడుతుందని, ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ శ్రీనివాస్, ప్రదీప్, విజయ భాస్కర్, శంకర నేత్రాలయ, యాంకర్ సుమలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేశామని, మా ప్రభుత్వం పేదల విద్య వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. పేదలకు అనారోగ్యం వస్తే ఎవరూ ఆదుకోరని, అందుకే ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైద్య సాయం 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామన్నారు. ఈ ఐ క్యాంపు ద్వారా ఇప్పటికీ 200 మందికి కాటరాక్ట్ ఆపరేషన్స్ చేస్తున్నారని, రాబోయో మూడు రోజుల్లో మరింత మందికి వైద్య సాయం అందిస్తారని కోరుకుంటున్నా అన్నారు. నా తరుపున మా స్టాఫ్ ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటారని, ఏ సాయం కావాలన్నా చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సాయం పొందుతున్న వారికి వైద్య పరీక్షలు, ప్రయాణ, భోజన, ఇతర ఖర్చులు ప్రభుత్వం తరుపున కాదు మా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరుపున ఎన్ని లక్షల ఖర్చైనా మేము సొంతంగా పెట్టుకుంటాం అన్నారు. సమాజంలో స్తోమత గల ప్రతి ఒక్కరూ పేదల కోసం సహాయ కార్యక్రమాలు చేయాలని పిలుపునిస్తున్నా అని అప్పుడే నిజమైన సంతృప్తి పొందగలుగుతామన్నారు. ఇక నానక్ రామ్ గూడలో ఉన్న స్థలం అన్యాక్రాంతం కాకుండా రిజిస్ట్రేషన్స్ ఆపించామని, అక్కడ సినిమా ఇండస్ట్రీ తరుపున పేద సినీ కార్మికులకు ఇళ్ల నిర్మాణం చేస్తామన్నారు.