విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' సినిమాలతో ఒక పెద్ద స్టార్ అయ్యాడు. ఆ తరువాత 'టాక్సీవాలా' అనే సినిమా కూడా హిట్ అయింది. ఇవన్నీ 2018 సంవత్సరం వరకు చేసిన సినిమాలు. కానీ ఆ తరువాత చేసిన సినిమాలు వ్యాపారాత్మకంగా విజయ్ కి బ్రేక్ ఇవ్వలేదనే చెప్పాలి. 'డియర్ కామ్రేడ్' సినిమా బాగుంది అన్నారు, కానీ వ్యాపారాత్మకంగా నడవలేదు. తరువాత ఇంకో పెద్ద సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' వచ్చింది, అది కూడా నడవలేదు. ఆ తరువాత పాన్ ఇండియన్ సినిమా అంటూ 'లైగర్' వచ్చింది, అది విజయ్ కెరీర్ లో ఒక పెద్ద మైనస్ అయింది. గత సంవత్సరం 'ఖుషీ' సినిమా విడుదలైంది, మిశ్రమ ఫలితం వచ్చింది. అంటే విజయ్ కి ఒక పెద్ద బ్రేక్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతోంది. అటువంటి సమయంలో ఇప్పుడు ఈ 'ది ఫామిలీ స్టార్' సినిమా విడుదలైంది. దీనికి పరశురామ్ పెట్ల దర్శకుడు, మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది. దిల్ రాజు, శిరీష్ సోదరులు నిర్మాతలు. గోపి సుందర్ సంగీతం అందించారు. మరి ఈ సినిమా విజయ్ కి బ్రేక్ ఇచ్చిందో, లేదో చూద్దాం.
కథ : గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆఖరివాడు. ఇద్దరు అన్నయ్యలు, వదినలు, వాళ్ళ పిల్లలు, బామ్మ, ఇలా ఒక మధ్యతరగతి కుటుంబంలో చిన్నవాడైన గోవర్ధన్ కుటుంబాన్ని తన భుజస్కందాలపై నడిపిస్తూ వుంటారు. ఎప్పుడూ ఎక్కడ అదా చెయ్యాలి, ఎలా డబ్బులు అదా చేయొచ్చు అని చూస్తూ ఉంటాడు. ఒక అన్నయ్య ఎప్పుడూ తాగుతూ మద్యం నడిపే దుకాణదారుడితో గొడవపడుతూ ఉంటాడు. అన్నయ్య పిల్లల స్కూల్ ఫీజులు, వాళ్ళ అవసరాలు అన్నీ గోవర్ధన్ చూసుకుంటూ సంపాదనలో అన్నీ జాగ్రతగా ఖర్చు పెడుతూ ఉంటాడు. అలాగే తన కుటుంబసభ్యులని ఎవరైనా ఏమైనా అన్నా ఊరుకునే మనస్తత్వం కూడా కాదు గోవర్ధన్ ది, ఎదురుతిరిగి తగిన బుద్ధి చెపుతూ వుంటాడు. అలాంటి సమయంలో ఆ ఇంట్లోకి వస్తుంది ఇందు (మృణాల్ ఠాకూర్) అనే అమ్మాయి. గోవర్ధన్ ఉంటున్న ఇంట్లోనే మేడ మీద ఒక గది ఖాళీగా ఉంటే అద్దెకి దిగుతుంది. గోవర్ధన్ మొదట్లో ఆమెని వ్యతికేరించినా, మెల్లగా ఆమె చేస్తున్న పనులు నచ్చి ఆమెతో ప్రేమలో పడతాడు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటాడు. అదే సమయంలో ఆమె గోవర్ధన్ మీద ఒక థీసిస్ రాస్తుంది, అది తను చేసే మధ్యతరగతి కుటుంబం గురించిన రీసెర్చ్ అని యూనివర్సిటీ లో సబ్మిట్ చేస్తుంది. అందులో గోవర్ధన్ మధ్యతరగతి కుటుంబం గురించిన వివరాలు అన్నీ ఉంటాయి. గోవర్ధన్ ఆ పుస్తకం చదివి తన కుటుంబాన్ని మొత్తం రోడ్డుమీదకు ఇందు తీసుకువచ్చిందని, ఆమెని అసహ్యించుకుంటాడు. మధ్య తరగతి కుటుంబం అంటే పస్తులుండే కుటుంబం కాదని, తలుచుకుంటే మేము కూడా సంపన్నులం అవగలమని చూపిస్తాడు. వెంటనే తనకి ఇంతకు ముందు ఆఫర్ ఇస్తామన్న ఒక పెద్ద వ్యాపారవేత్త (జగపతి బాబు) దగ్గరికి వెళ్లి తాను ఇప్పుడు ఆ జాబ్ తీసుకుంటానని ప్రాధేయపడితే అతను గోవర్ధన్ కి ఆ జాబ్ ఇస్తాడు, అలాగే రెండు సంవత్సరాల జీతం అడిగితే అది కూడా ముందే ఇస్తాడు. తాను మధ్యతరగతి కుటుంబం కాదని, ధనవంతుల కుటుంబం అని ఇందుకు చెప్తాడు, ఆమె మీద ద్వేషం పెంచుకుంటాడు. ఇంతకీ ఈ ఇందు అనే అమ్మాయి ఎవరు? ఆమె నిజంగానే గోవర్ధన్ మధ్యతరగతి కుటుంబాన్ని వీధిలోకి లాగడం కోసమే థీసిస్ రాసిందా? ఆ వ్యాపారవేత్త గోవర్ధన్ అడగగానే వుద్యోగం, జీతం ఇచ్చి ఎందుకు పెట్టుకున్నాడు? గోవర్ధన్, ఇందు మళ్ళీ కలిసారా? వాళ్ళు పెళ్లిచేసుకున్నారా? తరువాత ఏమైంది, గోవర్ధన్ జీవితం ఎటువంటి మలుపులు తిరిగింది తెలియాలంటే 'ది ఫామిలీ స్టార్' సినిమా చూడాల్సిందే.