బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేసే క్రమంలో సినీనటులు అక్కినేని నాగచైతన్య, సమంతల పేర్లను మంత్రి కొండా సురేఖ ప్రస్తావించడం తెలుగు సినీ, రాజకీయ రంగాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.సమంత - నాగచైతన్య విడాకులు తీసుకోవడం వెనుక కేటీఆర్ ఉన్నారని , ఎంతో మంది హీరోయిన్ల జీవితాలను ఆయన నాశనం చేశారని కొండా సురేఖ ఆరోపించారు. ఇవి చిత్ర పరిశ్రమలో దుమారం రేపగా పలువురు సినీ ప్రముఖులు దీనిపై స్పందించారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఆ వివరాల్లోకి వెళితే..గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బాపూఘాట్‌లో జాతిపితకు నివాళులర్పించిన మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. విదేశాల నుంచి కొన్ని అకౌంట్ల ద్వారా తనపై ట్రోలింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో సమంత- నాగచైతన్యల విడాకుల అంశాన్ని సురేఖ ప్రస్తావించారు. ఈ జంట విడిపోవడానికే కేటీఆర్ కారణమంటూ బాంబు పేల్చారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి, వారికి డ్రగ్స్ అలవాటు చేసి జీవితాలు నాశనం చేశాడని , హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోవడానికి కేటీఆరే కారణమంటూ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సురేఖ వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో స్వయంగా నాగచైతన్య తండ్రి, అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున స్పందించారు. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని సినీ ప్రముఖుల జీవితాలను ప్రత్యర్ధులని విమర్శించడానికి వాడొద్దని నాగ్ హితవు పలికారు. మా కుటుంబం పట్ల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని తక్షణం వాటిని ఉపసంహరించుకోవాలని నాగ్ డిమాండ్ చేశారు.నాగ చైతన్య కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. పరస్పర అంగీకారంతో తాను సమంతతో విడిపోయానని, ఈ విషయంపై ఇప్పటికే ఎన్నో నిరాధారమైన ఆరోపణలు వచ్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాన్ని మీడియా హెడ్‌లైన్స్ కోసం ఉపయోగించుకుంటోందని నాగచైతన్య ఫైర్ అయ్యారు. సమంత కూడా ఆ కాసేటికే రియాక్ట్ అయ్యారు. విడాకులు తన వ్యక్తిగత విషయమని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని.. తన పేరును రాజకీయాల కోసం వాడుకోవద్దని ఆమె హితవు పలికారు. తనను చిన్న చూపు చూడొద్దని.. తానెప్పుడూ రాజకీయాలకు దూరంగానే ఉంటానని సమంత స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంపై టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం దిగజారుడు రాజకీయం అన్నారు. మంత్రిగా మీరు హుందాగా, గౌరవంగా ఉండాలని ఎన్టీఆర్ సూచించారు. చిత్ర పరిశ్రమపై నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్న ఆయన.. బయటి వ్యక్తులు తమపై ఇలాంటి ప్రకటనలు చేస్తే చూస్తూ కూర్చొమని ఎన్టీఆర్ హెచ్చరించారు. హద్దులు దాటకుండా ఒకొరినొకరు గౌరవించుకునేలా ప్రవర్తన ఉండాలన్నారు.
Konda Surekha garu, dragging personal lives into politics is a new low. Public figures, especially those in responsible positions like you, must maintain dignity and respect for privacy. It’s disheartening to see baseless statements thrown around carelessly, especially about the…
— Jr NTR (@tarak9999) October 2, 2024
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa