తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు సరిగా ఆఫర్లు రావడం లేదని అందరూ అంటుంటారు. ఎక్స్‌పోజింగ్‌కు ఓకే చెప్పినప్పటికీ వీళ్లు దర్శక నిర్మాతల కళ్లలో పడటం లేదు.పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అనిపించుకున్నప్పటికీ వీరికి ఆఫర్లు మాత్రం దొరకడం లేదు. ఈ కోవలోకే వస్తారు అచ్చ తెలుగు అమ్మాయి ప్రియా వడ్లమాని. అందం, అభినయం, లుక్స్ అన్ని బాగున్నా ఈమెకు ఎందుకో ఆఫర్లు రావడం లేదు.27 ఆగస్ట్ 1997న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించారు ప్రియా వడ్లమాని. ఈమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. హైదరాబాద్‌లో పెరిగిన ప్రియా వడ్లమాని..నగరంలోనే ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. అనంతరం బెంగళూరులోని క్రిస్ట్ కాలేజీలో డిగ్రీ అందుకున్నారు. కెరీర్ ప్రారంభంలో మోడలింగ్‌లోనూ సత్తా చాటిన ఈ భామ.. ఫెమినా మిస్ ఇండియా (2016) పోటీల్లోనూ పాల్గొన్నారు. నటన వైపు ఆసక్తితో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రియా వడ్లమాని తొలుత అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్ స్టార్ట్ చేశారు.
ఈ క్రమంలో 2018లో ప్రేమకు రెయిన్ చెక్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత శుభలేఖలు సినిమాలో నటించినప్పటికీ అంతగా పేరు రాలేదు. ఈ క్రమంలో హుషారు సినిమాలో రియా క్యారెక్టర్ ఆమెకు బ్రేక్ తీసుకొచ్చింది. ఇందులో ప్రేమించిన అబ్బాయికి హ్యాండిచ్చే పాత్రలో ప్రియ నటన హైలైట్‌గా నిలిచింది. ఇందులోని అందం అమ్మాయైతే నీలా ఉందే పాట యువతను ఊపేసింది. హుషారు తర్వాత ప్రియ టాలీవుడ్‌ను దున్నేస్తుందని అంతా భావించారు. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది.
హుషారు తర్వాత ఆవిరి, కాలేజ్ కుమార్, ముఖ చిత్రం, ఓం భీమ్ బుష్, వీరాంజనేయులు విహారయాత్ర అనే సినిమాల్లో నటించారు. కానీ ఇవేవీ అంతగా వర్కవుట్ కాలేదు. ఈ ఏడాది మాచో స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వం సినిమాలో ప్రియా అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. ప్రస్తుతానికి ఈమె చేతుల్లో ఏ ప్రాజెక్ట్ లేదు. ఖాళీ సమయాల్లో డ్యాన్స్, స్విమ్మింగ్, పుస్తకాలు చదవడాన్ని ఇష్టపడే ప్రియా వడ్లమాని.. బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్ అంటే పడి చచ్చిపోతుంది.