విడాకులు, మయోసైటిస్ ఇలా వ్యక్తిగతం.. ఆరోగ్య సమస్యల కారణంగా సమంత తీవ్ర సమస్యలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ సామ్ లతో బిజీ అవుతోంది.కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాతో పాటు ప్రేక్షకుల ముందుకు కూడా రాని సమంత ప్రస్తుతం అనారోగ్యం నుంచి క్రమంగా కోలుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ ఇటీవల నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వచ్చిన విషయం తెలిసిందే.ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇక ఈ ఇంటర్వ్యూల్లో భాగంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, పడ్డ కష్టాలను గుర్తి చేసుకుంటూ ఎమోషనల్ అవుతోంది సామ్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విడాకులకు సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇద్దరి మధ్య బంధం తెగితే అమ్మాయిలే నిందిస్తారని, అలాంటి సమాజంలో మనం బతుకుతున్నామని చెప్పుకొచ్చింది.
ఇక విడాకులు తీసుకున్న అమ్మాయిలకు 'సెకండ్ హ్యాండ్, ఆమె జీవితం వృథా, యూజ్డ్' వంటి ట్యాగ్‌లను వేస్తుందని సమంత అసలు అలా ఎందుకు చేస్తారో అర్థం కావడం లేదని వాపోయింది. ఆ వ్యాఖ్యలు ఆ అమ్మాయిని, ఆమె కుటుంబాన్ని ఎంతో బాధిస్తాయన్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఇలాంటి కామెంట్స్ మరింత నిరాశపరుస్తాయన్నారు. తన గురించి కూడా ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశారన్న సామ్.. అవి అబద్ధాలు కాబట్టి వాటి గురించి మాట్లాడాలని అనుకోలేదని తేల్చి చెప్పారు.
కష్ట సమయంలో తనకు తన స్నేహితులు, కుటుంబసభ్యులు ఎంతో మద్దతుగా నిలిచారన్న సమంత వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఇక తన పెళ్లి గౌనును రీ మోడల్ చేయించుకున్న విషయం గురించి కూడా సమంత ఓపెన్ అయ్యింది. ఆ నిర్ణయం తీసుకున్న సమయంలో చాలా బాధపడ్డానని, గౌను రీ డిజైన్ చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించలేదని చెప్పుకొచ్చింది. జీవితంలో కష్టమైన దశలను దాటుకొని వచ్చానంటే అది బలానికి ప్రతీక మాత్రమే అన్న సమంత.. జీవితం అక్కడితో ముగిసిపోయిందని కాదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నాని చెప్పుకొచ్చింది. మొత్తం మీద అటు నాగచైతన్య, శోభిత పెళ్లి బంధంతో ఒక్కటువతోన్న వేళ సమంత చేస్తున్న వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.