నటి నయనతార తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2011 లో సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నాని తెలిపారు. అప్పట్లో నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభు దేవ ప్రేమ కోసం తన నటనా జీవితాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు నయనతార వెల్లడించింది. “ గతంలో నా జీవితంలో ప్రేమ కావాలంటే, నేను కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని నేను భావించే దశలో ఉన్నాను. ప్రేమ కావాలంటే ఎక్కడో ఒకచోట రాజీ పడాల్సిందేనని" ఆమె పేర్కొన్నారు.అలాగే ఆమె మాట్లాడుతూ.. మీరు మీ అన్నింటినీ మీ ప్రేమకోసం వదులుకోవాలి. మీరు చేస్తున్న పని మీ భాగస్వామికి నచ్చకపోతే, మీరు దానిని వదులుకోవాలి. ఆ సమయంలో ప్రేమపై నాకున్న అవగాహన అదే. కానీ నేను ఆతర్వాత స్ట్రాంగ్ అయ్యాను. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నాను అంటే ఆ బంధం వల్లనే. ఆ బంధం లేకుంటే ఇంత దూరం వచ్చేంత శక్తి నాకు ఉండేది కాదు. నాకు ఎంత సామర్థ్యం ఉందో నాకు అప్పుడు అర్థం కాలేదు. ఆ సంబంధం తర్వాత, నేను ఇప్పుడు పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా మార్చుకున్నాను” అని నయనతార చెప్పుకొచ్చింది. అదేవిధంగా “సినిమా అనేది వ్యాపారం మాత్రమే కాదని నేను గ్రహించాను. ఇది డబ్బు, కీర్తి గురించి మాత్రమే కాదు. కానీ అది నా జీవితంలో అంతర్భాగమైపోయింది. ఇది నేను నటించడానికే పుట్టాను. ఆఖరికి ‘శ్రీరామరాజ్యం’ చేసినప్పుడు సినిమాలకు దూరంగా ఉండలేనని అర్థమైంది’’ అని నయనతార చెప్పుకొచ్చింది.