ఫిల్మ్‌ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న తాజా పరిణామాలపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల సీఎంతో సినీ ప్రముఖుల భేటీని ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. "ఇటీవల టాలీవుడ్ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వచ్చిందనే అపోహకు ఈ భేటీతో తెరపడింది. అది బెస్ట్ మీటింగ్ అని అక్కడికి వెళ్లినవారు నాతో చెప్పారు. ఫిల్మ్ ఛాంబర్ తరఫున మేము గతంలో ప్రభుత్వాన్ని కలిశాం. గద్దర్ పురస్కారాల విషయంలో ప్రభుత్వానికి కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. ఇక తాజాగా విడుదలైన పుష్ప2కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. అంటే మనం ఇంటర్నేషనల్ స్థాయికి చేరాం. అన్ని భాషల్లో సినిమాలు తీస్తున్నాం. ప్రేక్షకులను అలరిస్తున్నాం. గతంలో మేము కూడా కొన్ని చిత్రాలకు బెనిఫిట్ షోలు వేశాం. కానీ, ఉచితంగా ప్రదర్శించడం జరిగింది. ఇప్పటి పరిస్థితులు భిన్నం. దీని గురించి ప్రేక్షకులు, నిర్మాతలు ఆలోచించాలి" అని తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పుకొచ్చారు