ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా తన అభిమానుల మీద అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుని శనివారం పవన్ కళ్యాణ్ పరమర్శించిన విషయం తెలిసిందే.అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా.. అతని అభిమానులు ఓజీ.. ఓజీ.. ఓజీ.. సీఎం.. సీఎం అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో అసహనానికి గురైన పవన్ కళ్యాన్.. అభిమానులను ఉద్దేశించి.. మీకు ఎక్కడ ఏం స్లోగన్ ఇవ్వాలో కూడా తెలియకపోతే ఎలా అయ్యా.. పక్కకి వెళ్లండి అంటూ అసహ్యించుకున్నాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ విషయంపై తాజాగా ఓజీ టీం స్పందిస్తూ.. అభిమానులు ఓజీ అని పవన్‌ని పిలవద్దంటూ రిక్వెస్ట్ చేసింది.ఓజీ సినిమాపై మీరు చూపిస్తున్న అభిమానం, ప్రేమ మా అదృష్టంగా భావిస్తున్నాము. ఓజీ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి నిరంతరం పని చేస్తున్నాం. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ సభలకు వెళ్లినప్పుడు, సమయం, సందర్భం చూడకుండా ఓజీ.. ఓజీ అని అరవడం, వారిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదు. వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఆ స్థానాన్ని, స్థాయిని గౌరవించడం మన కనీస బాధ్యత. అందుకని ఇంకొన్ని రోజులు ఓపికగా ఉందాం. 2025 ఓజీ పండుగ వైభవంగా నిలుస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం అంటూ డీవీవీ ఎంటర్‌టైనమెంట్స్ రాసుకోచ్చింది.