దర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల కొందరు కళాశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ, సినీ పరిశ్రమలో తన ప్రయాణం, అనుభవాలు, అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన 'ఖలేజా', విజయ్ దేవరకొండ నటించిన 'డియర్ కామ్రేడ్' చిత్రాల విషయంలో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, ఆ సినిమాలకు తాను ఎడిటింగ్ చేసి ఉంటే బాగుండేదని అనిపించినట్లు పేర్కొన్నారు. అయితే, వేరే దర్శకుల సినిమాలను తాను డైరెక్ట్ చేసి ఉంటే బాగుండేదని మాత్రం ఎప్పుడూ అనిపించలేదని స్పష్టం చేశారు.చిత్ర నిర్మాణంలో ఎడిటింగ్ ప్రాధాన్యతను నాగ్ అశ్విన్ నొక్కి చెప్పారు. సినిమా విజయంలో ఎడిటింగ్ కీలక పాత్ర పోషిస్తుందని, తాను కూడా గతంలో కొన్ని ప్రాజెక్టులకు ఎడిటర్‌గా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. తాను హాస్యాన్ని ఇష్టపడతానని, ముఖ్యంగా దివంగత దర్శకుడు జంధ్యాల సినిమాలంటే ఎంతో ఇష్టమని తెలిపారు.తన దర్శకత్వ శైలి గురించి వివరిస్తూ, ముందుగా కథను సిద్ధం చేసుకున్నాకే అందులోని పాత్రలకు సరిపోయే నటీనటులను ఎంపిక చేసుకుంటానని నాగ్ అశ్విన్ వివరించారు. ప్రతిష్ఠాత్మక చిత్రం 'కల్కి 2898 ఏడీ' విషయంలోనూ ఇదే పద్ధతిని అనుసరించానని, కథలోని పాత్రలను దృష్టిలో ఉంచుకుని మొదట అమితాబ్ బచ్చన్‌ను, ఆ తర్వాత ప్రభాస్‌ను ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. 'కల్కి' లాంటి భారీ చిత్రం వెనుక తన ఒక్కడి కష్టమే కాదని, అది ఒక టీమ్ సమష్టి కృషి అని, టీమ్‌లోని ప్రతి ఒక్కరి సలహాలను స్వీకరిస్తానని అన్నారు. మహాభారతం ఆధారంగా సినిమా తీయడం కొంత భయంగా అనిపించినా, ప్రతి సన్నివేశం వెనుక ఎంతో పరిశోధన, కృషి ఉందని వెల్లడించారు.పరిశ్రమలో విజయవంతంగా కొనసాగాలంటే కష్టపడి పనిచేయడం, పుస్తకాలు చదవడం వంటివి చాలా ముఖ్యమని ఆయన విద్యార్థులకు సూచించారు. ప్రతి ప్రాజెక్టును ఇదే చివరిది అనేంత నిబద్ధతతో చేయాలని, పుస్తకాలు సినిమాల కంటే ఎక్కువగా మనపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు. ఒక సాధారణ కథను కూడా ఆసక్తికరంగా చెప్పగలగడమే రచయిత నైపుణ్యమని అన్నారు.కొత్త కథలను సృష్టించడంలో ఎదురయ్యే సవాళ్ల గురించి మాట్లాడుతూ, కొన్నిసార్లు ఎంతో కష్టపడి రాసుకున్న కొత్త ఆలోచనలు, వేరే సినిమాల ట్రైలర్లలో కనిపించినప్పుడు నిరాశ కలుగుతుందని నాగ్ అశ్విన్ అంగీకరించారు. 2008లో తాను జ్ఞాపకాలు, కలల ఆధారంగా రాసుకున్న కథకు దగ్గరగా హాలీవుడ్ చిత్రం 'ఇన్‌సెప్షన్' ఉండటంతో వారం రోజుల పాటు డిప్రెషన్‌లోకి వెళ్లానని తన అనుభవాన్ని పంచుకున్నారు. ఎప్పుడూ కొత్త పాయింట్‌లతో సినిమాలు తీయడానికే ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. తనపై సినిమా తీస్తే 'నేను సుబ్రహ్మణ్యం' అనే టైటిల్ పెడతానని ఓ ప్రశ్నకు సరదాగా సమాధానమిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa