by Suryaa Desk | Mon, Dec 23, 2024, 03:19 PM
పుష్ప-2' ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్టుతో తెలంగాణ సర్కార్ తెలుగు సినిమా పరిశ్రమపై కక్ష గట్టిందంటూ ప్రతి పక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీ ఏపీకి తరలి వస్తే... అన్ని ఏర్పాట్లు చేస్తామని కొందరు నేతలు అన్నారు. దాంతో టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఏపీకి తరలి వెళుతుందని వార్తలు వచ్చాయి. అయితే, వార్తలపై తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. తాను నిర్మాతగా ఉన్న డాకూ మహారాజ్ ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం నాడు ఆ సినిమా మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై ఆయన మాట్లాడారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళుతుందనే వార్తలపై ఆయన స్పందించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళుతుందనే ప్రచారం కరెక్ట్ కాదన్నారు. తాను ఇక్కడే ఖరీదైన ఇల్లు కట్టుకున్నానని, ఇప్పుడు ఏపీకి వెళ్లి ఏం చేస్తానని అన్నారు. అలాగే తెలుగు చిత్రసీమకు రెండు తెలుగు రాష్ట్రాలు సమానమేనని పేర్కొన్నారు. ఇక త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ విషయంపై మాత్రం తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు.
Latest News