ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న మొదటి డిమాండ్ అదే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 07:45 PM

రేపు తెలంగాణలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆయా రంగాలపై కేటాయింపుల గురించి మండలిలో సభ్యులు చర్చించారు. ఈ క్రమంలో ఇటీవలే నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ చర్చలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ హోదాలో తొలిసారి మండలిలో అడుగుపెట్టిన తీన్మార్ మల్లన్న.. తన తొలి ప్రసంగాన్ని వినిపించారు.


తనకు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు మండలి ఛైర్మన్ గుత్తు సుఖేందర్ రెడ్డికి మొదట ధన్యవాదాలు తెలిపిన తీన్మార్ మల్లన్న.. పలు విషయాలను ప్రస్తావించారు. మొదట.. గ్రూప్ -1 మెయిన్స్‌ పరీక్షకు 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని.. అయితే ఈ రేషియోలో ఎక్కువగా బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నదనే విషయం తన దృష్టికి వచ్చిందని వివరించారు. టాప్ ర్యాంకర్లను జనరల్ కేటగిరిలో కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ కోటాలోకే తీసుకుంటున్నారని.. దీని ద్వారా ఎక్కువ మంది అణగారిన వారికి, మహిళలకు అన్యాయం జరుగుతున్నదన్న విషయం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. దయచేసి యూపీఎస్సీ తరహాలో ఉండేలా ఎంపిక చేస్తే ఎక్కువ మంది బడుగు, బలహీన వర్గాల అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని సర్కార్ దష్టికి తీన్మార్ మల్లన్న తీసుకెళ్లారు.


ఆ తర్వాత గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం గురించి కూడా మల్లన్న మాట్లాడారు. గంధమల్ల రిజర్వాయర్ అంశం సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉందని మల్లన్న తెలిపారు. అది తన సొంత మండలంలో ఉన్న ప్రతిపాదిత రిజర్వాయర్‌ అని తెలిపారు. గత కొంత కాలంగా భూసేకరణ విషయంలో సమస్యలున్నాయని చెప్తూ వస్తున్నారని చెప్పారు. అదే కాకుండా.. 9 టీఎంసీలు, ఆ తర్వాత 4 టీఎంసీలు.. అనంతరం ఒకటిన్నర టీఎంసీలంటూ.. పదే పదే మార్చుకుంటూ వస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలా.. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అగ్రిమెంట్ పూర్తయి.. ఏడేళ్లు గడించిందని మల్లన్న తెలిపారు.


గంధమల్ల ప్రాజెక్టు పూర్తయితే.. ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన ఏకైక జలాధారం అవుతుందని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో గత పాలకులు వహించిన నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతూ.. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. వీరారెడ్డిపల్లి, గంధమల్ల పరిధిలో భూసేకరణ సమస్యలను, పరిహారం అంశాలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఇందుకోసం.. గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని సంబంధింత మంత్రికి వినమ్రంగా విజ్ఞప్తి చేశారు తీన్మార్ మల్లన్న.


కాగా.. కాళేశ్వరం ప్రాజెక్టు టెయిల్‌ పాండ్‌లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో గంధమల్ల రిజర్వాయర్‌ను నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే మొదట.. 9.86 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కానీ.. పలు కారణాల రీత్యా 4.28 టీఎంసీలకు కుదించారు. 15, 16 ప్యాకేజీల్లో గంధమల్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్లను నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సాగు, తాగు నీటిని అందించాలనే లక్ష్యంతో డిజైన్‌ చేశారు. ప్రధానంగా గంధమల్ల రిజర్వాయర్‌ ద్వారా యాదాద్రిభువనగిరి, సిద్దిపేట జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాల్లో 63,300 ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. అందుకు అనుగుణంగా 15వ ప్యాకేజీకి సంబంధించిన ప్రధాన కాల్వ పనులను సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ మండలంలోని కొడకండ్ల గ్రామం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ములకలపల్లి వద్ద ముగిసేలా ప్రణాళిక రూపొందించారు.


అయితే.. ఈ రిజర్వాయర్‌ నిర్మాణానికి 2500 ఎకరాలు భూసేకరణ అవసరం. ఇందులో అటవీ శాఖకు చెందిన 830 ఎకరాల భూమికి పరిహారం సైతం చెల్లించారు. మిగిలిన భూమిని గంధమల్ల, ఇందిరానగర్‌, బచ్చలగూడెం తదితర గ్రామాల రైతుల నుంచి సేకరించాలి. గందమల్ల రిజర్వాయర్‌ పరిధిలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.6 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొండపోచమ్మ సాగర్‌, బస్వాయర్‌ రిజర్వాయర్ల ముంపు బాధితులకు ఇచ్చినట్టుగా 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.. పనులు అడ్డుకుంటున్నారు. ఓవైపు ప్రాజెక్టు సమర్థ్యాన్ని పదే పదే తగ్గించటం.. మరోవైపు బాధితుల నిరసనలతో ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగట్లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa