ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రన్నింగ్‌లో ఊడిపోయిన బస్సు టైర్లు,,,,తప్పిన పెద్ద ప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 18, 2024, 08:00 PM

సాధారణంగా పల్లెవెలుగు బస్సు కెపాసిటీ 45 నుంచి 50 మంది ప్రయాణికులు. కానీ.. ఈ బస్సులు గ్రామీణ ప్రాంతాలను కలుపుకుంటూ పట్టణాలు చేరుకుంటాయి కాబట్టి.. లెక్క ఎక్కువే అవుతుంది కానీ తక్కువ కాదు. అందులోనూ.. పాఠశాలు, కాలేజీల సమయాల్లో అయితే.. కాలు పెట్టడానికి కూడా సందు దొరకనంత రద్దీ ఉంటుంది. బయట నుంచి చూస్తే.. బస్సు ఓ వైపు వంగిపోయినట్టు కనిపిస్తుంటుంది. అంటే.. కేవలం ఒక ఫుట్ బోర్డుపైనే సగం బస్సుకు సరిపడా ప్రయాణికులు వేలాడుతూ ప్రమాదకర స్థితిలో ప్రయాణం చేస్తుంటారు. అదేదో సరదా కాదండోయ్.. లోపలికి వెళ్లేంత స్థలం లేకపోవటం వల్ల. ఇంత రిస్క్ ఎందుకు ఇంకో బస్సు కోసం ఎదురుచూద్దామా అంటే.. "నేను ఎక్కవలసిన బస్సు జీవితకాలం లేటు" అన్న సామెత నిజమవుతుంది. మరి అలాంటప్పుడు.. ఇలాంటి రిస్కులు తీసుకోకతప్పని పరిస్థితి. కానీ.. ఒక్కోసారి ఈ రిస్కులు మరీ పరిధిదాటిపోయి.. ప్రమాదాలకు కారణం అవుతుంటాయి. అచ్చంగా అదే జరిగింది జగిత్యాలలో.


నిర్మల్ డిపోకు చెందిన ఓ పల్లెవెలుగు బస్సు జగిత్యాల నుంచి నిర్మల్‌కు వెళ్తున్న క్రమంలో బస్సు వెనుక టైర్లు ఒక్కసారిగా ఊడిపోయాయి. దీంతో.. ఒక్క కుదుపుతో.. బస్సు బాడీ రోడ్డుపై పడి.. ముందుకు దూసుకెళ్లింది. అయితే.. డ్రైవర్ అప్రమత్తమై.. చాకచక్యంగా బస్సును కంట్రోల్ చేయటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అయితే.. ఇలాంటి ప్రమాదాలు అప్పడప్పుడూ జరుగుతుంటాయి సాధారణమే అనుకుంటే పొరపాటే. నిర్వాహణ లోపంవల్లనో.. టైర్లు సరిగ్గా బిగించకపోవటం వల్లనో ఈ ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం.. బస్సు ఓవర్ లోడే అంటున్నారు జనాలు. ఆ ఒక్క పల్లెవెలుగు బస్సులో ఏకంగా మూడు బస్సులకు సరిపడా ప్రయాణికులున్నారని ఆరోపణలు వస్తున్నాయి.


జగిత్యాల నుంచి బయలుదేరిన బస్సు.. మోరపల్లి శివారుకు చేరుకోగానే.. బస్సు వెనుకవైపు ఉన్న రెండు టైర్లు ఒక్కసారిగా ఊడిపోయాయి. అయితే.. బస్సులో 100కు పైగా ప్రయాణికులు ఎక్కటంతో బరువును మోయలేక.. టైర్లు వదులై ఊడిపోయినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రయాణికులెవ్వరికీ ఎలాంటి హాని జరగలేదు. కానీ.. కొంచెం మిస్సయినా.. పరిస్థితి ఊహించుకుంటే దారుణంగా ఉంది.


అయితే.. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 170 మంది ప్రయాణికులున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. బస్సుల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అయితే.. బస్సు ప్రమాదానికి ఓవర్ లోడ్ ఒక్కటే కారణం కాదని.. నిర్వాహణ లోపం కూడా ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. టైర్లు పూర్తి అరిగిపోయి ఉండటం.. నిర్వహణ జరిగ్గా లేకపోవటం వల్ల ప్రమాదం జరిగిందన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే.. బస్సులో 170 మంది ప్రయాణికులు ఉండటం సాధ్యమయ్యే పని కాదని.. ఉంటే 100కు పైగా ఉండి ఉండొచ్చన్న వాదన కూడా వినిపిస్తున్నారు.


ఏది ఏమైనా ఈ ప్రమాదంలో జరగరానిది ఏదైనా జరిగి ఉంటే.. ఆ పరిస్థితి బాధ్యత ఎవరు తీసుకునేవాళ్లన్నది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. బస్సులో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. వాళ్లలో ఏ ఒక్కరికీ ఏమీ కాలేదు కాబట్టి.. సరిపోయింది కానీ.. ఏమైనా జరిగి ఉంటే.. తప్పు ఎవరిదై ఉండేది. ఆ మార్గంలో ఉంటే ప్రయాణికులకు సరిపడా బస్సులను నడిపించని ప్రభుత్వానిదా.. కొంచెం కూడా బాధ్యత లేకుండా ఇష్టమొచ్చినట్టు ఎక్కించిన డ్రైవర్, కండక్టటర్లదా.. ఆ బస్సు ఎక్కపోతే ఇక జీవితమే ముగిసిపోయినట్టుగా భావించి గొర్రెల్లా ఎక్కి ప్రమాదంపై సవారీకి సిద్దమైన జనాలదా..? ఇలాంటి ఘటనలపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa