ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తామని ప్రకటించిన కౌశిక్ రెడ్డి.. బీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 13, 2024, 09:41 PM

తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.. ఫిరాయింపులపై మొదలైన మాటల యుద్ధం ఘర్షణల వరకు వెళ్లింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు గొడవకు దిగారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైటెన్షన్ వాతావరణం కనిపించింది. అయితే ఈ రగడ ఇంకా కొనసాగుతోంది.. కౌశిక్‌రెడ్డి ఇవాళ భారీ ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యారు. కచ్చితంగా చర్యకు తప్పకుండా ప్రతి చర్య ఉంటుందని.. ఇవాళ ఉదయం 11 గంటలకు వందలాది మందితో అరికెపూడి గాంధీ ఇంటిని ముట్టడించి తీరతామని.. తెలంగాణ పౌరుషాన్ని చూపిస్తామంటూ ఘాటుగా స్పందించారు. తాను ఎమ్మెల్యే గాంధీని సాదరంగా ఆహ్వానించి.. ఇంట్లోకి తీసుకెళ్లి భోజనం పెడదామని భావించానన్నారు కౌశిక్‌రెడ్డి. ఆయన రౌడీ షీటర్లతో తనపై దాడికి పాల్పడ్డారని.. హత్య చేయాలని చూశారన్నారు.


ఇవాళ ఉదయం శంభీపూర్‌ రాజు ఇంటి నుంచి గ్రేటర్‌లోని ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తామన్నారు కౌశిక్‌రెడ్డి. ఆయన బీఆర్ఎస్‌లోనే ఉన్నానని ఆయన చెబుతున్నందుకే వెళుతున్నామని.. అక్కడే బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌ చేస్తామన్నారు. అక్కడి నుంచి గాంధీని తెలంగాణ భవన్‌కు, కేసీఆర్‌ దగ్గరకు తీసుకెళ్తామన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని.. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసంలో భేటీ జరుగుతుంది అన్నారు. ఈ సమావేశానికి మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు హాజరవుతారన్నారు.


ఈ సమావేశానికి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా హాజరవుతారన్నారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నివాసం నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం బయలుదేరుతారన్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.


అరికెపూడి గాంధీని పీఏసీ ఛైర్మన్‌గా నియమించడంతో ఈ రగడ మొదలైంది.. కౌశిక్‌రెడ్డి గాంధీపై చీరలు, గాజులు కొరియర్‌ చేస్తా.. వేసుకొని తిరగండి అని చేసిన కొన్ని వ్యాఖ్యలతో దుమారం రేగింది. గురువారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పి, ఆయన ఇంటిపై పార్టీ జెండా ఎగురవేస్తానని.. ఆ తర్వాత తెలంగాణ భవన్‌కు తీసుకెళ్తామన్నారు. ఈ క్రమంలో గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి సవాల్ విసిరారు.. ఈ క్రమంలో ఉద్రిక్తత ఏర్పడగా అరికెపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. సాయంత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కలిసి కౌశిక్‌రెడ్డికి మద్దతుగా వెళ్లారు.


కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు వెళ్లారు. మాజీ మంత్రి హరీశ్‌రావు పోలీస్‌ ఉన్నతాధికారులకు ఫోన్‌ చేయగా.. ముఖ్య నేతలు రావాలంటూ సంయుక్త కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ చెప్పారు. ఆయన్ను కలిసేందుకు వెళ్తుండగా.. వారి వెంట కార్యకర్తలు వెళ్లారు. అక్కడ పోలీసులు అనుమతించకపోవడంతో కౌశిక్‌రెడ్డి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే గాంధీపై కేసులు నమోదు చేయాల్సిందేనని.. అక్కడి నుంచి కదలబోమన్నారు. దీంతో పోలీసులు మాజీ మంత్రి హరీష్‌రావు, తదితరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రాత్రి 9.30 గంటల సమయంలో వారిని వదిలేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa