సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. పదే పదే తన ఎత్తుపై మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. హరీష్ రావుపై కీలక వ్యాఖ్యలు చేయగా.. వాటికి సమాధానంగా తెలంగాణ భవన్‌లో హరీష్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు రెండు రకాల వరదలతో ఇబ్బంది పడుతున్నారని.. అందులో ఒకటి ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చిన వరదలైతే.. రెండోది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అబద్దాల వరద అంటూ ఎద్దేవా చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో వచ్చిన బురదను కడుక్కునే అవకాశం ఉందని.. కానీ రేవంత్ రెడ్డి అబద్ధాలు మాత్రం మోరీ కంపును మించి పోయాయంటూ చురకలంటించారు.
తన గురించి తన ఎత్తు గురించి పదే పదే సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లు చేస్తున్నారని ప్రస్తావించిన హరీష్ రావు.. తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. తాటిచెట్టంతా పెరిగావు.. దూలంలా పెరిగావు.. దూడకున్నంత మెదడు లేదనటమే కాకుండా.. సన్నాసి ఏడా దాక్కున్నావు అని కూడా తననుద్దేశించి మాట్లాడారని హరీష్ రావు పేర్కొన్నారు. తన ఎత్తు గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డిని.. తాను కూడా లిల్లీఫుట్ అంత లేవని గానీ.. అదే సన్నాసి అనే పదాన్ని తిరిగి అనటం పెద్ద కష్టమైనా పనా అని ప్రశ్నించారు. కానీ.. అలా అనడానికి తనకు మర్యాద, సంస్కారం అడ్డు వస్తున్నాయని హరీష్ రావు తెలిపారు.
తన ఎత్తు మీద ఎందుకంత అంత ఈర్ష్య అని రేవంత్ రెడ్డిని హరీష్ రావు అడిగారు. అది భగవంతుడు తనకు ఇచ్చిన వరమన్నారు. తన ఎత్తు గురించి ఎంత తిట్టినా.. ఎంత మాట్లాడినా తన అంత ఎత్తు పెరగలేవంటూ సెటైర్లు వేశారు.తన ఎత్తు గురించి మాట్లాడం మానేసి.. రైతుల గురించి ఆలోచించాలని హితవు పలికారు. తాను తాటి చెట్టంతా ఎదిగినా.. అందులో తప్పేముందని.. నీవు వెంపలి చెట్టంతా కూడా ఎదగలేదు కదా..? నీకు దేవుడు అంతే ఇచ్చాడంటూ తనదైన శైలిలో ఘాటు కౌంటరే ఇచ్చారు.
రుణమాఫీ జరిగితే రాజీనామా చేస్తా అన్న సన్నాసి ఎక్కడ దాక్కున్నావ్.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా హరీష్ రావు ఘాటుగానే స్పందించారు. తాను ఎక్కడా దాక్కోలేదని.. నీ గుండెల్లోనే నిద్ర పోతున్నానంటూ వ్యాఖ్యానించారు. నిద్ర పట్టనివ్వకుండా చేస్తూ.. ప్రతిక్షణం రుణమాఫీ గురించి గుర్తు చేస్తున్నానని తెలిపారు. ఇప్పటికే సగం రుణమాఫీ చేయించాననని.. మిగతా సగం రుణమాఫీ చేసేంత వరకు కూడా వెంట పడుతూనే ఉంటానన్నారు హరీష్ రావు.
పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా హరీష్ రావు స్పందించారు. కాంగ్రెస్‌కు అంత సీన్ లేదని.. రాజస్థాన్‌లో, ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే అర్థమవుతుందన్నారు. రేవంత్ రెడ్డి అదృష్టం బాగుండి గెలిచాడని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా.. తిట్ల దండకాలు ఆపేసి.. ప్రజల కోసం పని చేసి.. ఐదేళ్ల పాటు మంచిగా పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. రెండోసారికి సీన్ లేదంటూ రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa