ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాదాద్రి భక్తులకు భారీ శుభవార్త.. గుట్టపైనే ఆ సౌకర్యం కూడా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2024, 06:59 PM

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు మరో శుభవార్త వినిపించనున్నారు ఆలయ అధికారులు. ఆలయ పునర్నిర్మాణం కారణంగా.. రకరకాల సౌకర్యాలు, సేవలను నిలిపివేయగా.. ప్రస్తుతం వాటిని ఒక్కొక్కటిగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే.. గుట్టపై భక్తులు నిద్రచేసే అవకాశాన్ని కల్పించటంతో పాటు కొండపైన స్నాన సంకల్పం చేసేందుకు.. విష్ణు పుష్కరిణిని కూడా భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా గిరిప్రదక్షిణ సేవను కూడా ప్రారంభించారు. ఇలా గతంలో ఉన్న రకరకాల సౌకర్యాలు, సేవలను తిరిగి భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే.. కొండపై మరో సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆలయ అధికారులు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.


అయితే.. గతంలో కొండపైన భక్తుల వసతి కోసం గదులు ఉండేవి. అయితే.. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా.. ఆ గదులను పూర్తిగా తీసేశారు. దీంతో.. ఇప్పుడు భక్తులెవరైనా యాదాద్రిలో ఉండాలంటే.. కొండ కిందే గదులు తీసుకోవాల్సిన పరిస్థితి. దీంతో.. భక్తులు కొంత ఇబ్బందికి గురవుతున్నారు. భక్తుల అసౌకర్యాన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు.. యాదగిరిగుట్టపైనే సుమారు 200 గదులను భక్తుల కోసం నిర్మించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.


రాత్రి వేళల్లో కొండపై బస చేసి.. స్వామివారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ఈ వసతి గదులు నిర్మించాలన్న ప్రతిపాదనను ధార్మిక వ్యవహారాల శాఖ అధికారులు.. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే.. దాతల సహకారంతో గదులు నిర్మించేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


అయితే.. ఈ వసతి గదుల కోసం.. శివాలయం వెనుక ఉన్న బాలాలయం స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అక్కడ.. సుమారు 200 గదులు నిర్మించే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఒకవేళ.. అధికారుల ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకారం చెప్తే.. వెంటనే కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది. అదే జరిగితే.. కొండపైన భక్తులు బస చేసే సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది. దీంతో.. మళ్లీ పాత రోజులు వచ్చే అవకాశం ఉందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


అయితే.. ప్రస్తుతం కొండపై గ్రీన్ హోటల్‌ గదులు మాత్రమే ఉన్నాయి. అవి పరిమిత సంఖ్యలోనే ఉండటంతో భక్తులు గుట్ట కిందే బస చేయాల్సి వస్తోంది. రాత్రి పూట గదుల్లో బస చేసి.. తెల్లవారుజామునే స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు రావాలంటే.. భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుట్టపైకి బస్సులు ఉచితం అయినప్పటికీ.. అవి ఉదయంపూట సమయానికి రాకపోవటంతో.. భక్తులు కొంత అసౌకర్యానికి లోనవుతున్న మాట వాస్తవం.


అయితే.. ఆ ఇబ్బదులన్నింటికీ పరిష్కారంగా గుట్టపైనే పెద్ద సంఖ్యలో గదులు ఏర్పాటు చేయాలని అధికారుల ఆలోచన. కాగా.. యాదాద్రికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఇటీవలే ఆలయ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించి.. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. తిరుమల తరహాలో యాదాద్రి బోర్డు ఏర్పాటు చేయాలని సూచించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో.. అధికారులు కూడా గదుల ప్రతిపాదనతో సిద్ధంగా ఉన్నారు. దీన్ని బట్టి త్వరలోనే.. గుట్టపై గదులు కూడా అందుబాటులోకి రానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa