ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్.. అదనంగా 5 వేల మందికి ఉద్యోగాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 08:47 PM

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో హెచ్‌సీఎల్ త్వరలో కొత్త క్యాంపస్ ప్రారంభిస్తోంది. ఇందులో అదనంగా 5 వేల మంది ఇంజనీర్లకు ఉద్యోగాలను కల్పించనుంది. సచివాలయంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవానికి రావాలని రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు.


విద్యార్థులకు మెరుగైన శిక్షణతో పాటు, విద్యా వనరులను విస్తరించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో హెచ్‌సీఎల్ భాగస్వామ్యం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది యువకులకు ప్రయోజనం చేకూర్చే నైపుణ్యాభివృద్ధికి హెచ్‌సీఎల్‌తో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.


రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధి అవకాశాల కల్పనకు హెచ్‌సీఎల్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. హెచ్‌సీఎల్‌కు రాష్ట్ర ప్రభుత్వం తగినంత సహకారం అందిస్తుందన్నారు. హెచ్‌సీఎల్ వ్యూహాత్మక భాగస్వామ్యం యువతకు ఉద్యోగాలను కల్పించటంతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.


రాష్ట్రంలో యువతకు నైపుణ్యాలు నేర్పించి సాధికారత కల్పించేందుకు చేపట్టే కార్యక్రమాల్లో తమ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని రోష్ని నాడార్ తెలిపారు. ఉపాధి అవకాశాలతో పాటు సాంకేతిక సామర్థ్యాలను HCL GUVI పెంపొందిస్తుందని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వంతో తమ కంపెనీ భాగస్వామ్యం పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించి అభ్యాసకులకు సాధికారత కల్పిస్తుందని అన్నారు. ఔత్సాహిక సాంకేతిక నిపుణులను తయారు చేస్తుందని చెప్పారు.


స్కిల్ యూనివర్సిటీతో పాటు హెచ్‌సీఎల్ విద్యా కార్యక్రమాలను తెలంగాణలో ఉన్న ఇతర విశ్వవిద్యాలయాలకు విస్తరించే ప్రణాళికలు, దీంతో ఎక్కువ మంది లబ్ధి పొందుతారనే ఆలోచనలను కూడా ఈ సమావేశంలో పంచుకున్నారు. HCL రెండేండ్ల కిందట తమ నైపుణ్య విభాగం జీయూవీఐని ప్రారంభించింది. దీంతో దేశీయ భాషల్లో సాంకేతిక కోర్సులను అందిస్తోంది. ప్రధానంగా సాంకేతిక విద్యలో భాషా అవరోధాలు తొలిగించేందుకు కృషి చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa