తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఉనికి రాజకీయంగా లేకుండా చేయాలనేది తన అభిమతమని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నాలుగు గోడల మధ్య పరిమితమయ్యారంటే అది తన వల్లేనని.. కేటీఆర్‌ను బయటకు తీసుకొచ్చి కేసీఆర్‌ను ఫామ్ హౌసుకే పరిమితం చేశానని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మరో సంవత్సర కాలంలో కేసీఆర్ పేరు కనపడకుండా చేస్తాననని తెలిపారు. ఏడాది తరువాత కేసీఆర్ రాజకీయం ముగుస్తుందన్న రేవంత్ రెడ్డి.. తరువాత కేసీఆర్ పేరు కనపడకుండా చేస్తానంటూ చెప్పుకొచ్చారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో పార్టీ వ్యవహారంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. దీపావళి అంటే చిచ్చుబుడ్లు చూస్తామని.. కానీ కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్‌లో సారాబుడ్లు చూస్తున్నామంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీపావళి పార్టీ అంటే విదేశీ మద్యం, క్యాసినో కాయిన్స్, డ్రగ్స్ ఉంటాయా అంటూ ప్రశ్నించారు. కేటీఆర్, ఆయన బావమరిది పార్టీలు చేసుకోవడానికి ఫామ్ హౌసులు ఉండాలి కానీ.. మూసీ పరిసర ప్రాంత ప్రజలు మాత్రం అక్కడే దుర్భరంగా గడపాలా అంటూ నిలదీశారు రేవంత్ రెడ్డి.
మూసీపై అఖిల పక్షానికి సిద్ధమన్న రేవంత్ రెడ్డి.. గండిపేట ఫామ్ హౌసుల్లో బలిసి కొట్టుకుంటున్న వారికి మూసీ ప్రజల కష్టసుఖాలు ఏం తెలుస్తాయంటూ సంచలన కామెంట్లు చేశారు. తాను కోరుకున్నది ప్రజలు తనకు ఇచ్చారు.. వారికేం కావాలో తాను ఇవ్వాలంటూ తెలిపారు. మూసీ పునరుజ్జీవం కోసం లక్షన్నర కోట్లన్నది అబద్ధమని తెలిపారు. మూసీ ప్రజల కష్టసుఖాలు వినేందుకు వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు పాస్ పోర్టు రద్దయిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఆయన ఏ దేశంలో ఉన్నా అక్రమ వలసదారుడేనని చెప్పుకొచ్చారు. ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు బయటకు వచ్చాడని తెలిపిన రేవంత్ రెడ్డి.. త్వరలో ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వస్తుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ ఒప్పందాల్లో అవినీతిపై కమిషన్లు తేల్చిన తర్వాతే చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవస్థలను దుర్వినియోగం చేయనన్నారు.
కార్పొరేట్ కంపెనీల నుంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు దండుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు. అదే కార్పొరేట్లతో తాము స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మిస్తున్నామన్నారు. అదానీతో ఒక్క ఒప్పందమైనా కుదుర్చుకున్నట్టు చూపించాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకుందో లిస్టు బయటపెడతానన్నారు. 10 నెలల్లో ప్రభుత్వం ఒక్క మేజర్ టెండర్ పిలవలేదన్నారు. భూములు కూడా అమ్మలేదని క్లారిటీ ఇచ్చారు. అయినా.. అవినీతి అంటూ గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోవటానికి హైడ్రా కారణం కాదని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. దేశమంతా రియల్ ఎస్టేట్ పడిపడిపోయిందని.. అదే క్రమంలో ఇక్కడా పడిపోయిందన్నారు. వరంగల్, కరీంనగర్‌లో హైడ్రా ఉందా.. మరి అక్కడెందుకు పడిపోయిందని ప్రశ్నించారు. అభివృద్ధిలో తనది రాజమౌళి వర్కింగ్ స్టైల్.. రామ్ గోపాల్ వర్మ స్టైల్‌లో వెళ్లమంటే తాను వెళ్లనని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa