వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట రవణ ప్రోగ్రాం అధికారులు, డిప్యూటీ డిఎంహెచ్వోలు జిల్లా పరిధిలోని అన్ని పీహెచ్ సి ల వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ అన్ని రకాల జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో పి.హెచ్.సి వైద్యాధికారుల పనితీరు ఆధారంగానే జిల్లా వైద్యశాఖ ప్రగతి ఆధారపడి ఉంటుందని కాబట్టి వైద్యాధికారులందరూ ఖచ్చితంగా సమయపాలన పాటించి విధులకు హాజరు కావాలని ప్రస్తుతం అమలులో ఉన్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు ముఖ్యంగా వ్యాధి నిరోధక టీకాలు, మాత శిశు సంరక్షణ సేవలు, కీటక జనిత వ్యాధులైన డెంగ్యూ, మలేరియా నివారణ నియంత్రణ చర్యలు, కుష్టు మలేరియా, హెచ్ఐవి వంటి అంటువ్యాధుల నివారణ, నియంత్రణ నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. మధుమేహము, రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణ కొరకు నిరంతరం స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగించాలని కోరారు. పొగాకు ఉత్పత్తులైన బీడీ,సిగరెట్టు, గుట్కా కైనీ, జరద వంటి వాటిని వినియోగించకుండా వాటి వలన కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు.
ముఖ్యంగా గర్భవతులకు అన్ని రకాల వైద్య సౌకర్యాలు, సేవలు అందే విధంగా జాగ్రత్త పడాలని ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించాలని సాదరణ ప్రసవాలు జరిగే విధంగా చూడాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ ఆపరేషన్ లను చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాలైన త్రాగునీటి వసతి, పేషంట్ వేచియుండు గదిలో కుర్చీలు ఉండే విధంగా చూడాలని మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో స్లాబ్ లీకేజీలు, డ్రైనేజీ సమస్యలు, కనీస వసతులకు ఏర్పాటు కొరకు త్వరలో నిధులు విడుదల చేస్తామని తెలిపారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి ప్రతి ఒక్కరూ వారి వారి విధులను సక్రమంగా నిర్వర్తించాలని కార్యాలయ పని వేళలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వోలు డాక్టర్ జీవరాజ్, డాక్టర్ రవీంద్ర యాదవ్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ బుచ్చిబాబు, డాక్టర్ నేహా, డాక్టర్ నిరోషా మరియు డిప్యూటీ డి ఎం ఓ శ్రీనివాసులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగమల్లేశ్వరరావు, ఆఫీస్ సూపరిండెంట్ నర్సిములు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, డిఎం అండ్ హెచ్ ఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa