తెలంగాణ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు నెలల క్రితం రైతుల ఖాతాల్లో రూ.2 లక్షల రైతు రుణమాఫీ సొమ్ములు జమ చేసింది. ఇక ఇప్పుడు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఎకరాకు రూ. 15 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందించనున్నారు. తాజాగా.. తెలంగాణలో పాడి రైతులకు సైతం సర్కార్ తీపి కబురు చెప్పింది. తెలంగాణలోని రైతులు విజయ డెయిరీకి పాలు విక్రయిస్తుండగా.. ఆయా పెండింగ్ బిల్లుల చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఓ నెల పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం రూ. 50.65 కోట్లను తాజాగా విడుదల చేసింది. ఆ మెుత్తాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని పశుసంవర్థకశాఖకు ఆదేశాలు జారీ చేసింది. మరో నెల బకాయిలు కూడా ఉండగా.. వాటిని త్వరలోనే చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాగా, తెలంగాణ వ్యాప్తంగా పాడి రైతుల నుంచి విజయ డెయిరీ రోజుకు 4.40 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేస్తుంది. అయితే నిధుల కొరత కారణంగా కొన్ని నెలలుగా చెల్లింపులు వాయిదా పడుతూ వస్తున్నాయి. తాజాగా ఓ నెల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
త్వరలో రైతు భరోసా నిధులు.. ఇక తెలంగాణ ప్రభుత్వం అన్నదాతులు ఎంతగానో ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. రైతు భరోసా పక్కాగా అమలు చేసేందుకు కఠినమైన గైడ్‌లైన్స్ రూపొందిస్తోంది. ఇప్పటికే కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేయగా.. రైతు భరోసా మార్గదర్శకాలపై సభ్యులు చర్చించారు. కేవలం సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణలో రకరకాల విజ్ఞప్తులు రాగా.. ఫైనల్‌గా ఏడెనిమిది ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన తెలంగాణలో సాగు భూమి 1.39 కోట్ల ఎకరాలు ఉండగా.. సుమారు 7 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల చివరి వారం కల్లా తొలి విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.