తెలంగాణ రైతులు రేవంత్ రెడ్డి సర్కారు మరో బిగ్ న్యూస్ వినిపించింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో.. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. 25 రోజుల పాటు నిర్వహించే ఈ విజయోత్సవాలల్లో.. ప్రభుత్వం ఏడాది కాలంలో ఏం ఏం చేసింది.. భవిష్యత్తులో ఏం ఏం చేయనుందన్నది ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే.. రేవంత్ రెడ్డి సర్కారుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు ఈ ప్రజా విజయోత్సవాలను ఓ వేదికగా చేసుకోనుంది. ఈ నేపథ్యంలోనే.. ఎన్నికల్లో ఇచ్చిన మరో మహత్తరమైన హామీని పూర్తి చేసి.. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది సర్కార్.
అయితే.. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రైతు రుణమాఫీని నెరవేర్చామని చెప్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. త్వరలోనే మరో శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే.. 18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ.. త్వరలోనే మరో 13 వేల కోట్లు విడుదల చేయనున్నట్టు చెప్తోంది. అయితే.. ఇంత చేసినా రైతులు మాత్రం ప్రభుత్వంపై ఇంకా నిరాశతోనే ఉండటం గమనార్హం. దానికి కారణం.. రైతులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకాన్ని అమలు చేయకపోవటమే.
దీంతో.. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ రైతులకు నగదు సాయం ఇవ్వటం లేదంటూ అటు అన్నదాతల్లో నిరాశ నెలకొనగా.. ఇటు ప్రతిపక్షాలు కూడా సమయం దొరికినప్పుడల్లా ఎండగడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో.. రైతు భరోసాను వీలైనంత తొందరగా అమలు చేసి.. అటు రైతుల్లో ప్రభుత్వం మీద ఉన్న నిరాశను తీసేయటమే కాకుండా.. ప్రతిపక్షాలకు విమర్శలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏడాది పాలన పూర్తవుతున్న వేళ ఎలాగైనా రైతు భరోసా హామీని నెరవేర్చాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించగా.. నిధుల సర్దుబాటుకు ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఒక ఎకరా నుంచి మొదలు పెట్టి.. డిసెంబర్ చివరి నాటికి రైతుభరోసాను పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
అయితే.. గత ప్రభుత్వంలో రైతు బంధు పథకంలో అవకతవకలు జరిగినట్టు రేవంత్ రెడ్డి సర్కార్ ఆరోపిస్తున్న నేపథ్యంలో.. రైతు భరోసాను పకడ్బంధీగా అమలు చేయాలని నిర్ణయిచింది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీలో రైతు భరోసా మార్గదర్శకాలపై చర్చించారు. కేవలం సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని సబ్ కమిటీ నిర్ణయం కూడా తీసుకున్నట్టు సమాచారం. అయితే.. ప్రజాభిప్రాయ సేకరణలో సబ్ కమిటీకి ప్రజల నుంచి రకరకాల విజ్ఞప్తులు రాగా.. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించి.. తుది మార్గదర్శకాలను వెల్లడించనున్నారు. అయితే.. ఏడు నుంచి ఎనిమిది ఎకరాలు ఉన్న అన్నదాతలకే రైతు భరోసా ఇవ్వాలని నిబంధన పెట్టనున్నట్టు సమాచారం.
ప్రభుత్వం ఏడు- ఎనిమిది ఎకరాల ప్రతిపధికన రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తే.. తెలంగాణలో సాగు భూమి 1.39కోట్ల ఎకరాలు ఉండగా.. సుమారు 7వేల కోట్ల నిధులు అవసరమవుతాయని సర్కార్ అంచనా వేస్తోంది. ప్రతి 10 రోజులకు 1500 కోట్ల నుంచి 2 వేల కోట్ల వరకూ రైతు భరోసా డబ్బును అన్నదాతల అకౌంట్లలో జమ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఈ రైతు భరోసా పథకాన్ని 45 రోజుల్లో పూర్తి చేయాలని.. సుమారు 7 వేల కోట్లు రైతు ఖాతాల్లో జమ చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.