ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ రకరకాల కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే.. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలవుతుండగా.. రద్దీ పెరిగిన క్రమంలో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా మార్గాల్లో స్పెషల్ బస్సులను నడిపిస్తోంది టీజీఎస్ ఆర్టీసీ. అంతేకాకుండా.. కార్గో సేవలను కూడా విజయవంతంగా అందిస్తోంది. పండుగలకు, ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక రాయితీలు కూడా ఇస్తూ.. ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇవన్నీ ఒకెత్తయితే.. పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తోంది టీజీఎస్ ఆర్టీసీ. ఈ ఎలక్ట్రిక్ బస్సుల వల్ల.. పర్యవరణ కాలుష్యాన్ని తగ్గించటమే కాకుండా అటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కూడా అందించినట్టవుతోంది. దీంతో.. ప్రయాణికుల నుంచి కూడా మంచి స్పందనే వస్తోంది.
ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు సమస్య ఆ ఎలక్ట్రిక్ బస్సులు నడిపే డ్రైవర్ల దగ్గర వస్తోంది. ఈ ఎలక్ట్రిక్ బస్సులను అందరూ నడపలేరు. అనుభవం ఉన్న డ్రైవర్లే వీటిని నడపగలరు. పైగా.. టీజీఎస్ ఆర్టీసీ భారీగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసింది. మొన్నటివరకు కేవలం హైదరాబాద్ నగరంతో పాటు కొన్ని మార్గాల్లోనే నడవగా.. ఇప్పుడు అన్ని జిల్లాల మార్గాల్లో ఈ ఎలక్ట్రిక్ బస్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో.. ఆర్టీసీలో భారీగా డ్రైవర్ల అవసరం పడింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు వినూత్నంగా ఆలోచించారు.
అక్కడక్కడా బట్టల దుకాణాలు, మాల్స్‌లలో హెల్పర్స్ కావలెను, సేల్స్ గర్ల్స్ కావలెను.. అంటూ బోర్డులు చూస్తుంటాం. అచ్చంగా అదే పద్ధతిలో.. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైవర్లు కావాలంటూ ప్రకటన బోర్డులు ఏర్పాటు చేశారు టీజీఎస్ ఆర్టీసీ అధికారు. "డ్రైవర్లు కావలెను" అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ప్రకటనలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డ్రైవింగ్ రంగంలో ఉన్న యువతకు ఇది మంచి అవకాశం అని కొంత మంది సానుకూలంగా స్పందిస్తుంటే.. ఇంకొంత మంది నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
మరోవైపు తెలంగాణ సైనిక సంక్షేమశాఖ.. టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులకు మాజీ సైనికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన రాష్ట్రంలోని 1201 డ్రైవర్ పోస్టులకు సైనిక సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపికైనా వారికి నెలకు రూ.26 వేల వేతనంతో పాటు రోజువారి అలవెన్స్ కింద రూ.150 చెల్లించనున్నట్టు ప్రకటించారు.
ఇధిలా ఉంటే.. ఇప్పటికే టీజీఎస్ ఆర్టీసీలో సుమారు 600 డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని ఖాళీలున్నా.. ప్రస్తుతం ఉన్న డ్రైవర్లతోనే కాలం వెల్లదీస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో.. ఆర్టీసీ డ్రైవర్లపై ఒత్తిడి పెరుగుతోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. డ్రైవర్ల కొరతతో.. 8 గంటలు చేయాల్సిన డ్యూటీ.. ఒక్కోసారి 10 నుంచి 14 గంటలు చేస్తున్నట్టు పలువురు డ్రైవర్లు చెప్తున్నారు. కంటిన్యూ డ్యూటీలు చేస్తుండటం వల్ల చాలా సందర్భాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa