తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉదయం 8 దాటినా సూర్యుడి దర్శనం కలగటం లేదు. మంచు దుప్పటి కప్పేస్తుండటంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆదిలాబాద్, అసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 11-15 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే 9 డిగ్రీల సెల్సియస్‌కు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు.
ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. చాలా ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. భారీగా మంచు కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నేడు హైదరాబాద్ నగరంలో వాతావరణం నిర్మలంగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఉదయం వేళల్లో పొగమంచు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలుగా.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలుగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఉపరితల గాలులు తూర్పు, ఈశాన్య దిశలో గంటకు 04-08 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇక చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రెండేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. చలికాలంలో పిల్లల్లో శ్వాసకోస సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయని అంటున్నారు. పిల్లలపై ఎక్కువగా వైరల్ ఇన్‌ఫెక్షన్లు దాడి చేసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. జలుబుతో ప్రారంభమై..తర్వాత వైరస్‌లతో న్యుమోనియా, ఫ్లూ లాంటివి వస్తాయని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం విషమించే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
చిన్న పిల్లలు, వృద్ధుల్లో ఆగకుండా జలుబు, దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు. వెంటనే డాక్టర్లను సంప్రదించాలని చెబుతున్నారు. కిడ్నీ సమస్యలు, ఆస్తమా, గుండె జబ్బులు ఉన్నవారు చలికాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. చల్లని గాలులు చెవుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. వేడి వేడి ఆహారం తీసుకోవటంతో పాటుగా.. గోరు వెచ్చని నీరు తాగాలని చెబుతున్నారు. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే వెచ్చని ఉన్ని దుస్తులు ధరించాలని.. చర్మం ఎండిపోకుండా మాయిశ్చరైజర్లు, నూనెలు రాసుకోవాలని చెబుతున్నారు.