తన చిన్న కుమారుడు మంచు మనోజ్‌ను ఉద్దేశించి సినీ నటుడు మోహన్ బాబు ఓ ఆడియోను విడుదల చేశారు. మనోజ్... నిన్ను అల్లారుముద్దుగా పెంచానంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. తాగుడుకు అలవాటు పడి చెడు మార్గంలో వెళుతున్నావంటూ మనోజ్ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. భార్య మాటలు విని నా గుండెల మీద తన్నావ్ అంటూ ఆక్రోశించారు."మనోజ్ నిన్ను అల్లారుముద్దుగా పెంచాను. నీ చదువుల కోసం చాలా ఖర్చు చేశాను. భార్య మాటలు విని నా గుండెల మీద తన్నావ్. కొన్ని కారణాల వల్ల మనమిద్దరం గొడవ పడ్డాం. ప్రతి ఇంట్లోనూ గొడవలు ఉంటాయి. కానీ నువ్ ఇంట్లో వారందర్నీ ఎందుకు కొడుతున్నావ్? బతుకుదెరువు కోసం పని చేసే వారిని కూడా కొడుతున్నావ్. ఇది మహాపాపం! జల్పల్లిలోని ఇల్లు నా కష్టార్జితం. దీంతో నీకు సంబంధం లేదు. తాగుడుకు అలవాటుపడి చెడు మార్గంలో వెళుతున్నావ్" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.మనోజ్ తనను కొట్టలేదని, తామిద్దరం ఘర్షణ మాత్రమే పడ్డామని ఆ ఆడియోలో పేర్కొన్నారు. మనోజ్ దాడి చేస్తే కొంతమందికి గాయాలయ్యాయని తెలిపారు. వినయ్‌ని కొట్టడానికి ప్రయత్నించావు, అన్నను చంపుతానని అంటావా? అని మండిపడ్డారు. తన ఇంట్లో అడుగు పెట్టడానికి ఎవరికీ అధికారం లేదన్నారు.ఇప్పుడు రోడ్డెక్కి నా పరువు తీశావని మోహన్ బాబు మండిపడ్డారు. నా ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా? వద్దా? అనేది నా ఇష్టమే అన్నారు. నా ఇష్టమైతే పిల్లలకు ఇస్తాను... లేదంటే దానం చేస్తానని పేర్కొన్నారు. మా నాన్న నాకేమీ ఆస్తులు ఇవ్వలేదని, తాను కష్టపడి సంపాదించుకున్నానన్నారు. నా ఇంట్లోకి మనోజ్ అక్రమంగా జొరబడ్డాడన్నారు. పైగా నా మనుషులపై చేయి చేసుకున్నాడన్నారు. అందుకే తనకు రక్షణ కావాలని పోలీసులను కోరినట్లు చెప్పారు.నీ కూతురిని నీవు తీసుకెళ్ళవచ్చని మనోజ్‌ను ఉద్దేశించి మోహన్ బాబు పేర్కొన్నారు. తన వద్ద వదిలిపెట్టినా తాను చూసుకుంటానని చెప్పారు. నీకు కావాలంటే పోలీసుల సమక్షంలో నీ బిడ్డను నీకిస్తానని చెప్పారు. మన ఇంట్లో జరుగుతున్న సంఘటనలతో మీ అమ్మ ఆసుపత్రిలో చేరిందని మనోజ్‌ను ఉద్దేశించి తెలిపారు. మన విద్యాసంస్థల్లో ఎక్కడా ఎలాంటి తప్పు జరగడం లేదన్నారు. విద్యాసంస్థల్లో ప్రతిదీ లీగల్ అన్నారు.జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటిని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, మోహన్ బాబు, మంచు విష్ణు తుపాకులను, లైసెన్స్‌ను సీజ్ చేయాలంటూ రాచకొండ పోలీసులు సిఫార్స్ చేసినట్టు సమాచారం. అంతకుముందు, పోలీసు ఉన్నతాధికారులను కలిసిన మనోజ్, మౌనిక దంపతులు జల్పల్లిలోని ఇంటికి వచ్చారు. వారు ఇంట్లోకి రాకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. గేట్లు ఓపెన్ చేయలేదు. దీంతో మనోజ్ దంపతులు చాలాసేపు కార్లోనే కూర్చుండిపోయారు. చాలాసేపటి తర్వాత గేటు వద్దకు వెళ్లిన మనోజ్ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.ఏడు నెలల పాప లోపల ఉందని చెబుతూ గేట్లు తోసుకొని లోనికి వెళ్లాడు. ఆ తర్వాత పోలీసులు ఇరుపక్షాల బౌన్సర్లను అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం ఇంటిని అధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇరు పక్షాల బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించారు