ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 బాక్సాఫీస్ దగ్గర రికార్డులు కొల్లగొడుతోంది. విడుదలైన అన్ని చోట్ల విజయవంతంగా ఆడుతూ.. ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తోంది. అయితే.. ఇదే పుష్ప-2 ప్రీమియర్ మాత్రం ఓ విషాద ఘటనను మిగిల్చిన విషయం తెలిసిందే. ఆ ఘటన.. అటు పుష్ప-2 టీమ్‌ను, హీరో అల్లు అర్జున్‌ని, ఆ ఘటన జరిగిన సంధ్య థియేటర్ ఓనర్‌ని మాత్రం బాధపెడుతూనే ఉంది. డిసెంబర్ 04వ తేదీన జరిగిన ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఇప్పటికీ ఆస్పత్రిలోనే ఉన్నాడు.
కాగా.. ఈ వ్యవహారంలో పలువురు ఇచ్చిన ఫిర్యాదులతో పాటు పోలీసులు కూడా అటు అల్లు అర్జున్ టీమ్ మీద, సంధ్య థియేటర్ యాజమాన్యం మీద పలు కేసులు నమోదు చేశారు. ప్రేక్షకుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంధ్య థియేటర్ మీద, థియేటర్‌కు వస్తున్నట్టు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీమ్ మీద.. చిక్కడపల్లి పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇదే విషయంపై సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా హైకోర్టును ఆశ్రయించింది. పుష్ప-2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమాని రేణుకా దేవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతిచ్చిందని.. పైగా ప్రీమియర్ షో తాము నిర్వహించలేదని.. ఆ షోను డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయినా తమ బాధ్యతగా బందోబస్తు కల్పించామన్నారు. అలాంటి తమపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. మరి.. అల్లు అర్జున్, సంధ్య థియేటర్ ఓనర్లు వేసిన పిటిషన్లపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై ఇప్పటికే అటు హీరో అల్లు అర్జున్, పుష్ప-2 బృందం తీవ్ర సంతాపం వ్యక్తం చేయటంతో పాటు బాధిత కుటుంబానికి బన్నీ తనవంతుగా రూ.25 లక్షల పరిహారాన్ని కూడా ప్రకటించారు. అవసరమైన సహాయాన్ని అందిస్తానని హామీ కూడా ఇచ్చారు. పిల్లాడి వైద్యానికి అయ్యే ఖర్చును కూడా భరిస్తామని అల్లు అర్జున్ భరోసా ఇచ్చారు. తమ బృందం ఎప్పటికప్పుడు ఆ కుటుంబంతో మాట్లాడుతోందని ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు అల్లు అర్జున్.